31న డీసీసీబీ పాలకవర్గ సమావేశం
ఫుడ్ పార్క్ కేటాయింపుపై సర్వత్రా హర్షం
ఖమ్మం,మార్చి26 (జనంసాక్షి) : ఈనెల 31న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గ సమావేశం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో జరుగనుంది. డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు అధ్యక్షతన జరుగుతుందని సీఈఓ వి.నాగచెన్నారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న జరగాల్సిన పాలకవర్గ సమావేశం, మహాజన సభ 31వ తేదీకి వాయిదా పడినట్లు తెలిపారు. 31న ఉదయం పాలకవర్గ సమావేశం, మధ్యాహ్నం మహాజన సభ జరుగుతుందనినా నాగచెన్నారావు తెలిపారు. ఇందులో రైతుల రుణాలు, ఎరువుల పంపిణీ తదితర అంశాలను చర్చిస్తారు. ఇదిలావుంటే జిల్లాకు ఫుడ్ పార్క్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం అవుతోంది. రైతులు, వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుటోంది. తెలంగాణ రాష్టాన్రికి రెండు మెగా ఫడ్ పార్కులు కేటాయించగా.. వీటిలో ఒకటి ఖమ్మం జిల్లాకు మంజూరు కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మౌలిక సదుపాయాల సంస్థ ఫడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. జిల్లాలోని సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఫడ్‌పార్క్ ఏర్పాటుకు అవసరమైన 98 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆహార పార్కుల ఏర్పాటులో భాగంగా శీతల గిడ్డంగులతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. టమాట, ఇతర కూరగాయలను నెలల తరబడి నిల్వ ఉంచుకునే వెసులుబాటు కలగనుంది. మంచి ధర వచ్చినప్పుడే విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఫడ్‌పార్కుల ఏర్పాటుతో రైతులు, వినియోగదారులకు ప్రయోజనం ఉంటుందని, మధ్య దళారీల బెడద తగ్గుతుంది. వినియోగదారులకు కూడా తక్కువ ధరకే నాణ్యమైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి సుమారు లక్ష ఎకరాల్లో మామిడి తోటలు లక్ష ఎకరాల్లో మిర్చి, నిమ్మ, అరటి, బత్తాయి, బొప్పాయి తోటలు 50 నుంచి 60 వేల ఎకరాలు, జీడిమామిడి 10 వేల ఎకరాలు, కూరగాయలు 20 వేల ఎకరాలు, ఆయిల్‌పామ్ తోటలు 13 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటితో పాటు వరి సుమారు 2.50 లక్షల ఎకరాల్లోనూ, మొక్కజొన్న, ఇతర ధాన్యం పంటలు కలిపి సుమారు 80 నుంచి లక్ష ఎకరాల వరకు సాగవుతున్నాయి. ఒక్క పత్తి తప్ప మిగతా అన్ని పంటల ఉత్పత్తులకు కూడా ఆహార పార్కు వల్ల ఎంతో ప్రయోజనం జరుగుతుంది.