జూన్ 4 నుంచి పార్లమెంట్
6న సభాపతి ఎన్నిక
9న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
మంత్రులకు మోడీ దిశానిర్దేశం
న్యూఢిల్లీ, మే 29 (జనంసాక్షి) : పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 16వ లోక్‌సభ తొలిసారి సమా వేశం కానుంది. జూన్ 4 నుంచి 12 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేం ద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి సమావేశంలో
ప్రధాన తన సహచరులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధమ్యాలను వివరించిన ఆయన.. పాలనలో పారదర్శకత తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన అంశాలను వివరించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని సూచించారు. మంత్రుల వ్యవహార శైలిపైనా సూచనలు చేశారు. బంధుప్రీతి, అవినీతికి దూరంగా ఉండాలని ఉద్బోధించారు. శాఖల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్..
కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడారు. తొలి రెండు రోజులు జూన్, 4, 5 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని, జూన్ 6న స్పీకర్ ఎన్నిక కార్యక్రమం చేపడతామని చెప్పారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి కమల్‌నాథ్ వ్యవహరించనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఆయన ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. వీరేంద్రసింగ్, పీఏ సంగ్మా సహా ముగ్గురు పేర్లను ప్యానెల్ స్పీకర్లుగా సిఫార్సు చేసినట్లు వెంకయ్య చెప్పారు. డెప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత చేపట్టనున్నట్లు వెల్లడించారు. 8, 9 తేదీలు శని, ఆదివారం కావడంతో, ఆ రెండ్రోజులు సమావేశాలు జరగవు. జూన్ 9 నుంచి రాజ్యసభ సమావేశం కానుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. జూన్ 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. 12వ తేదీ తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత జూలైలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూలైలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మంత్రులకు మోడీ ఉపదేశం..
తన క్యాబినెట్ సహచరులకు ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. వివాదాలకు తావివ్వకుండా మసలుకోవాలని ఉపదేశించారు. ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేసేందుకు, తమ వారి పట్ల పక్షపాతం చూపిస్తున్నామనే విమర్శలకు అవకాశమివ్వకుండా ఉండేందుకు ఆయన తన మంత్రులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. బంధుప్రీతిని తగ్గించుకోవాలని కుటుంబ సభ్యులను, బంధువులను వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకోవద్దని సూచించారు. ప్రజా సంబంధ వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికారు. అలాగే, మీడియాతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. శాఖల పనితీరుపై ఎప్పటికప్పుడు సవిూక్ష నిర్వహించాలని, అవినీతిని, అలసత్వాన్ని దరి చేరనీయొద్దన్నారు. ప్రతి శాఖ మొదటి వంద రోజుల ప్రగతి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రెండో కేబినెట్ సమావేశంలోనే ఆయన పారదర్శక పాలనకు పది సూత్రాలను ఉద్బోధించారు. సమర్థ పాలన, హామీ ఇచ్చిన పథకాల ఆచరణలపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు. రాష్ట్రాల ప్రగతే దేశాభివృద్ధికి కీలకమని నమ్మిన ప్రధాని.. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలు తమ ముందుకు తెచ్చిన సమస్యలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని కోరారు. వంద రోజుల ప్రణాళిక నిర్ణయించుకొని కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సహాయ మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించాలన్నారు. తన ప్రభుత్వ ప్రాధామ్యాలను ఆయన మంత్రులకు వివరించారు.
మోడీ పది సూత్రాలు..
– బ్యూరోక్రాట్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం
– అధికారుల నుంచి కొత్త ఐడియాలు ఆహ్వానించడం, పని చేసేందుకు పూర్తిస్వేచ్ఛనివ్వడం
– పాలనలో పారదర్శకత తీసుకురావడం, ఈ-ఆక్షన్‌ను ప్రోత్సహించడం
– విద్య, ఆరోగ్యం, నీరు, విద్యుత్, రహదారులకు ప్రాధాన్యమివ్వడం
– ప్రజోపయోగ విధానాల రూపకల్పనకు అత్యధిక ప్రాధాన్యం
– మౌలిక వసతులు, పెట్టుబడుల సంస్కరణలు తీసుకురావడం
– మంత్రిత్వ శాఖల మధ్య సమన్యయ వ్యవస్థ రూపొందించడం, సాంకేతికత, సోషల్ మీడియాను
వినియోగించుకోవడం
– ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడం
– నిర్ణీత కాలావధిలో పథకాల అమలు
– ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం, సమర్థత