5లోగా రైతులకు ఇవ్వండి
హైదరాబాద్, జూన్ 30 : జిల్లాకు కరువు సహాయం కింద మంజూరైన 62 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ మొత్తాన్ని జూలై 5లోగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి బ్యాంకర్లకు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని స్ఫూర్తి భవన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ, పంట రుణాల పంపిణీపై బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 62 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీలో ఇప్పటి వరకు 31 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, మిగిలిన 31 కోట్ల సబ్సిడీని 25లోగా వారివారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వలసపోయిన, మరణించిన తదితర రైతుల వివరాలను సమర్పించాలని అదే విధంగా రైతుల బ్యాంకు ఖాతాల సేకరణ, రైతుల ఖాతాలు తెరవడం వంటి పనులను కూడా జూలై 5లోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీపై నిర్లక్ష్యం వహించే వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. పంట రుణాలపై కలెక్టర్ సమీక్షిస్తూ ఖరీఫ్‌లో 401 కోట్ల రుణాలను అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 169 కోట్ల రుణాలను రైతులకు అందజేయడం జరిగిందని, జూలై 15లోగా నిర్దేశించిన పంట రుణాలను సకాలంలో రైతులకు అందజేయాలని బ్యాంకర్లకు సూచించారు. ముఖ్యమంగా ఎస్‌బిహెచ్, ఆంధ్రాబ్యాంక్, దక్కన్ గ్రామీణ బ్యాంక్, హెచ్‌డిసిసి వంటి మేజరు బ్యాంకులు పంట రుణాలను సకాలంలో రైతులుకు అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నందున దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించి సకాలంలో రుణాలను చెల్లించి వడ్డీ భారం పడకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రవీందర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.