5న రేషన్ డీలర్ల చలో ఢిల్లీ
నల్లగొండ,జనవరి31(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఒకే విధానాన్ని కొనసాగించాలని, డీలర్ల సమస్యల పరిష్కారానికి 5న ఢిల్లీలో నేషనల్ కమిటీతో సమావేశం ఉందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికొటి రాజు అన్నారు. రేషన్ డీలర్లకు క్వింటాలుపై రూ.300 కమిషన్ చొప్పున నెలకు రూ. 50 వేల వచ్చేలా చూడాలని, లేదా జూనియర్ అసిస్టెంట్ వేతనాన్ని అందించాలన్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. 6న దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సంఘాలన్నీ నేషనల్ కమిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందించనున్నట్లు ఆయన తెలిపారు. సమస్యలపై స్పందించకపోతే మార్చి మొదటి వారం నుంచి దేశ వ్యాప్తంగా సమ్మె శంఖారావం చేపడతామన్నారు. గోదాంల వద్ద వేబ్రిడ్జి ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, దీనికి సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, మార్చి, ఏప్రిల్ వే బ్రిడ్జిలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలువడం జరిగిందని, డీలర్ల సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారని, సమస్యలన్నీ పరిష్కరించుకుందామని తెలియజేశారన్నారు.