60ఏండ్లలో జరగని అభివృద్ధిని.. 

44నెలల్లోనే కేసీఆర్‌ చేసి చూపించారు
– కాంగ్రెస్‌ నేతల అలసత్వంతోనే జిల్లాలో ప్లోరైడ్‌ భూతం కబలించింది
– ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్‌ అహర్నిశలకు కృషి చేస్తున్నారు
– అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం..
– కాంగ్రెస్‌ నేతలు మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నారు
– మంత్రి  జగదీశ్‌ రెడ్డి
– మంత్రి తుమ్మలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించిన జగదీష్‌రెడ్డి
నల్గొండ, జనవరి25(జ‌నంసాక్షి) : 60ఏండ్ల కాలంలో జరగని అభివృద్ధి తెరాస అధికారంలో వచ్చిన 44నెలల్లోనే కేసీఆర్‌ అద్భుతాలు చేసి చూపిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జగదీశ్‌ రెడ్డి గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నార్కట్‌ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు మంత్రలు జగదీశ్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ భూతం కబలించడానికి కారణం కాంగ్రెస్‌ నేతల అలసత్వమే కారణమని అన్నారు. చేతకాని వారిలా పదవులకు అమ్ముడు పోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని, ఏ ఊరికి వెళ్లినా ప్రజలే జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తారన్నారు. కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధిని చూడలేక ఆక్రోశాన్ని ఆపుకోలేక ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడలేక పలాయనం చిత్తగించిన కాంగ్రెస్‌ నేతలు బయటికి వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.  అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లె సీఎం కేసీఆర్‌దేనని, అన్ని పల్లెలకు సమానంగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని తుమ్మల తెలిపారు. వీలైనన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. నకిరెకల్‌ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి 25 కోట్లు మంజూరు చేస్తున్నామని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.