60వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన సమ్మె

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 22 జనం సాక్షి.    సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న సమ్మె  గురువారం నాటికి 60 రోజుల కు చేరింది.  సుమారు రెండు నెలల నుండి నిరవధిక నిరసన చేపడుతున్న ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక లేకపోవడం విచారకరమని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు ఏగుల శ్రీనివాస్ అన్నారు. బుధవారం హైదరాబాదులోని దోమలగూడా యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన వీఆర్ఏ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశంలో సమ్మెపై ముందుకు వెళ్లడానికి మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారని ఆయన తెలిపారు. దీనికి కొనసాగింపుగా తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని శ్రీనివాస్ అన్నారు. మంత్రి కేటీఆర్ తమ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో చర్చించినప్పటికి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదన్నారు. తమ నిరసన యధా విధంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను సాధించుకునేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వీఆర్ఏలు వెంకట్, శ్రీకాంత్, అనిల్, రమేష్, కాశిరాం, భీమ్ రావు,  సాయిబాబా, సాయిలు, రవి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.