తెలంగాణ 60 ఏళ్ల డిమాండ్‌


అన్ని పార్టీలతో సంప్రదించి పరిష్కరించాం
మీకు బాధ కలిగించినా తప్పలేదు
కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌
విశాఖ టు చెన్నై వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌
సీమాంధ్రకు ప్రత్యేక హోదా : సోనియాగాంధీ
గుంటూరు, మే 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు 60 ఏళ్ల డిమాండ్‌ అని, అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే తెలంగాణ అంశానికి పరిష్కారం చూపమని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు సీమాంధ్రులకు బాధ కలిగించినా దానిపై నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సీమాంధ్రలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీఏ ఛైర్‌పర్సన్‌ ఇక్కడి ప్రజల్లో ఉన్న భయాలను, ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీమాంధ్రకు సౌకర్యాలు కల్పించే అంశాలను రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచామని సోనియా చెప్పారు. సీమాంధ్రకోసం చేపట్టిన పథకాలను ఆమె గుంటూరు వేదికగా జరిగిన సభలో గుర్తుచేశారు. సీమాంధ్ర యువత ఉపాధికి తాను పూచీ ఇస్తున్నానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. గుంటూరులోని వీఎం కళాశాల మైదానంలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా మాట్లాడారు. సీమాంధ్ర విద్యార్థుల భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని చెప్పారు. హైదరాబాద్‌లోని ఆంధ్రా విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు పదేళ్లపాటు యథాతథంగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ అంశాన్ని తాము క్షణ్ణంగా పరిశీలించామని, చాలా ఆలోచించే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అక్కడి ప్రజల చిరకాల వాంఛ అని అందుకే తెలంగాణ ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే ముందు సీమాంధ్రుల మనోభావాలను కూడా అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సీపీఎం మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. అందరి ఆమోదంత తరవాతనే కాంగ్రెస్‌ విభజన నిర్ణయం తీసుకున్నదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సుధీర్ఘ కాలం కొనసాగింది కాబట్టే విభజన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా తెలంగాణ అంశాన్ని తన వద్ద ప్రస్తావించారని సోనియా వెల్లడించారు. విభజన తరవాత 13 జిల్లాలకు మేలు జరగాలని కోరుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా సీమాంధ్రకు అనేక రాయితీలు, ప్యాకేజీలు ప్రకటించామన్నారు. అలాగే ఈప్రాంత అభివృద్దికి పూచీ తమదన్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి చెన్నైవరకు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు సంకల్పించామన్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు వంటివి తమ ప్రణాళికలో ఉన్నాయన్నారు. నెల్లూరులో దుగరాజపట్నం పోర్టు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక ¬దా ఇస్తున్నాం.. అంటే కేంద్ర నిధుల్లో 90శాతం ఉచితంగా, 10 శాతం రుణంగా ఇసామతమని పేర్కొన్నారు. ‘మేం ఏం చెప్తామో అవి చేసి చూపిస్తామని విూకు తెలుసు. అందుకే ఆంధప్రదేశ్‌ ప్రజలు సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది..’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు. విభజన వల్ల హైదరాబాద్‌లోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశాలు కోల్పోతామని సీమాంధ్ర విద్యార్థులు ఆందోళన చెందనక్కరలేదని సోనియా గాంధీ అన్నారు. పదేళ్లపాటు విద్యావకాశాల్లో యథాతథ స్థితి కొనసాగుతుందని ఆమె హావిూ ఇచ్చారు. ఇన్నాళ్లూ చదువుకున్నట్లే ఇంకో పదేళ్లపాటు ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఈలోపల సీమాంధ్రలో పలు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పుతామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను తాను అర్థంచేసుకోగలనని సోనియాగాంధీ అన్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే ఉద్దేశంతోనే చాలా ఆలోచించిన తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని ఆమె పేర్కొన్నారు. గుంటూరులాంటి చారిత్రక ప్రాధాన్యం కల ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించే నగరం గుంటూరని ఆమె పేర్కొన్నారు. సోదర సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో ఒక్క మాట చెప్పి ఆమె ప్రసంగం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జెడి శీలం, పనబాక లక్ష్మి, చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.