త్వరలో తెలంగాణకు గుడ్‌న్యూస్‌

ఓయూ జేఏసీతో దిగ్విజయ్‌సింగ్‌

విద్యార్థుల నోరు తీపిచేయబోయిన డిజ్జిరాజా

తెలంగాణ వచ్చాకేనన్న ఓయూ జేఏసీ

న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి) :

త్వరలోనే తెలంగాణ ప్రజలు గుడ్‌న్యూస్‌ వింటారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తెెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోందని, త్వరలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు త్వరలోనే తీపు కబురు చెబుతామని ఆయన ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ త్వరగా నిర్ణయం తీసుకోవాలని తనను కలిసిన ఓయూ జేఏసీ నేతలకు దిగ్విజయ్‌సింగ్‌ స్వీట్లు పంచి మరీ ఈ విషయం చెప్పడం గమనార్హం. ఓయూ జేఏసీ నేతలు సోమవారం దిగ్విజయ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సత్వరమే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికలలోపు తెలంగాణపై ప్రకటన రాకపోతే ఎన్నికల గిమ్మిక్కు అని ప్రజలు భావిస్తారని విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దానికి దిగ్విజయ్‌సింగ్‌ బదులిస్తూ.. త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారు. ‘పది పదిహేను రోజుల్లో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుంది. మీ వాళ్లను ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పండని’ సూచించారు. భేటీ ముగిసిన అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరించారు. అయితే తెలంగాణ ఇచ్చిన తర్వాతే స్వీట్లు ఇస్తే బాగుంటుందని ఓయూ జేఏసీ నేతలు ఆయనతో వ్యాఖ్యానించారు. అనంతరం దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని, నిర్ణయం తర్వాత వచ్చే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ వెల్లడించారు. తెలంగాణ అంశానికి నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదని తేల్చేశారు. రాష్ట్ర విభజనపై రోడ్‌ మ్యాప్‌ తయారు చేయాలని సీఎం, డెప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లకు సూచించామని, వారు నివేదిక ఇచ్చిన అనంతరం నిర్ణయం ఉంటుందని తెలిపారు. సోమవారం దిగ్విజయ్‌సింగ్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అంశంపై స్పందించారు. రాష్ట్ర విభజనపై రోడ్‌ మ్యాప్‌ తయారు చేయాలని సీఎం, డెప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లకు సూచించామని, వారు నివేదిక ఇచ్చిన అనంతరం నిర్ణయం ఉంటుందని తెలిపారు. రాజకీయ వ్యూహం కూడా తయారు చేయాలని కోరామన్నారు. ఆ ముగ్గురి ప్రజెంటేషన్‌కు అవకాశమివ్వాలని హైకమాండ్‌ను కోరానని తెలిపారు. కోర్‌ కమిటీలో తనతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, గులాం నబీ ఆజాద్‌ కూడా పాల్గొంటారని చెప్పారు. ఆ సమావేశంలోనే తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని తెలిపారు. ఎప్పటిలోగా నిర్ణయం వెలువడుతుందని ప్రశ్నించగా.. తెలంగాణపై నిర్ణయానికి సంబంధించి స్పష్టమైన గడువు చెప్పలేనని దిగ్విజయ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. తాను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఒక నివేదిక సమర్పించానని తెలిపారు. అయితే, సీఎం, డెప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు తమ తమ నివేదికలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమవుతుందని, ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై రోడ్‌మ్యాప్‌ తయారు తయారు చేసేందుకు వారికి ఓ గడువు అంటూ ఏవిూ లేదన్నారు. వారెప్పుడైనా వచ్చి నివేదిక సమర్పించవచ్చని తెలిపారు. వారిచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ అంశాన్ని తేల్చేస్తామన్నారు. ఈలోగా ఆయా ప్రాంతాల వారు తన వద్దకు వచ్చి తమ అభిప్రాయాలు చెబుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ప్రశ్నించగా పొత్తుల అంశంపై రాహుల్‌ నేతృత్వంలోని సబ్‌ కమిటీ చూసుకుంటుందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, రాయలసీమలో వైఎస్సార్‌సీపీ, కోస్తాలో టీడీపీయే మాకు పోటీ అని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఇదిలా ఉంటే, అంతకుముందు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలని కోట్ల విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో విభజించాల్సి వస్తే.. మూడు రాష్టాల్రు ఏర్పాటు చేయాలని కోరారు. రాయల తెలంగాణ పేరుతో సీమ ఉనికి లేకుండా చేయొద్దని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాయలసీమను విభజించవద్దని, రాష్ట్ర విభజన అనివార్యమైతే సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు. మరోవైపు, రేణుకాచౌదరి ఏం మాట్లాడింది తెలియరానప్పటికీ, సీమను విభజించవద్దని ఆమె కూడా కోరినట్లు సమాచారం.