తెలంగాణపై రేపు కోర్‌కమిటీలో నిర్ణయం

ఢిల్లీకి సీఎం, డెప్యూటీ సీఎం, బొత్స

రోడ్‌ మ్యాప్‌ రెడీ.. అధిష్టానం ఏం చేస్తుందో మరి?

హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీలో కీలక నిర్ణయం తీసుకునే గడువు సమీపిస్తోంది. అందుకు ఇంకో రోజు మాత్రమే గడువుంది. తెలంగాణ అంశంపై శుక్రవారం ఢిల్లీలో కోర్‌ కమిటీ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు. తెలంగాణ ఇవ్వడమా? రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమా? అన్నది ఆ భేటీలోనే తేలిపోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులుండగా, తెలంగాణలో మాత్రం పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న ధీమాలో కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అనుకూల నిర్ణయం కోసం ఎవరికి తోచిన స్థాయిలో వారు లాబీయింగ్‌ ముమ్మరం చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ రోడ్‌మ్యాప్‌ రూపకల్పన దాదాపు పూర్తయింది. నేతల నుంచి సేకరించి రూపొందించిన రోడ్‌మ్యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించి, తెలంగాణకు ప్యాకేజీ ప్రకటించాలని సీఎం, పీసీసీ చీఫ్‌ హైకమాండ్‌కు నివేదించబోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్యాకేజీ ప్రకటన అనంతరం ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటానని సీఎం స్పష్టం చేయనున్నట్లు సమాచారం. డెప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ రోడ్‌మ్యాప్‌పై నేతల అభిప్రాయాలు తీసుకుంటుంటే.. సీఎం మాత్రం సొంతంగా నివేదిక రూపొందిస్తుండడం గమనార్హం. బుధవారం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు సీఎం కిరణ్‌తో సమావేశమయ్యారు. బొత్స సత్యనారాయణతో పాటు మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, శైలజానాథ్‌, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తదితరులు కిరణ్‌తో భేటీ అయ్యారు. రాష్టాన్న్రి విభజించవద్దని, సమైక్యంగా ఉంచాలని కోరుతూ వంద పేజీల నివేదిక సమర్పించారు. రాష్ట్ర విభజన జరిగితే జల వనరులు సహా మిగతా పంపకాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలకు నష్టం కలుగుతుందని, ఆయా అంశాలను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లాలని నేతలు కిరణ్‌ను కోరారు. భేటీ ముగిసిన అనంతరం శైలజానాథ్‌ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్‌, డెప్యూటీ సీఎంలకు కూడా వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈనెల 16న అనంతపురంలో సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తామన్నారు. గురువారం ఉదయం సీఎం కిరణ్‌, డెప్యూటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఢిల్లీ బయల్దేరనున్నారు. శుక్రవారం జరిగే కోర్‌ కమిటీ కీలక భేటీలో వీరు తమ నివేదికలు అందజేయనున్నారు. వాటి ఆధారంగా హైకమాండ్‌ రాష్ట్ర విభజనపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఇది వరకే ప్రకటించారు.