కొండ తవ్వారు.. ఎలుకను కూడా పట్టలేదు

గంటల తరబడి కోర్‌ కమిటీ సమావేశం

తెలంగాణపై నిర్ణయం జరుగలేదు

బంతి సీడబ్ల్యూసీలోకి

సంప్రదింపులు ముగిశాయి..

అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి

ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసేనన్న దిగ్విజయ్‌

న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) :

తెలంగాణపై తేల్చేస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ కోర్‌కమిటీ సమావేశం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని చందంగా మారింది. గంటల తరబడి నిర్వహించిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. తెలంగాణపై తేల్చాల్సిన బంతిని సీడబ్ల్యూసీ కోర్టులోకి నెట్టేసి కోర్‌ కమిటీ భేటీ ఉసూరుమనిపించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన కోర్‌ కమిటీ సమావేశం రెండు గంటలపాటు జరిగింది. సమస్యను దాటవేస్తుందని, స్థానిక ఎన్నికలలో లబ్ధిపొందాలనేదే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తుందని ఇప్పటికే తెలంగాణ సమస్యను ఎన్నికలతో ముడిపెడుతుందని చేసిన ప్రచారం నూటికి నూరు పాళ్లు తేలిపోయింది. తెలంగాణ బంతి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి చేరింది. కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక కమిటీ సిడబ్ల్యూసిలో దీనిపై చర్చిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. సీఎం, డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్‌లతో సుదీర్ఘంగా చర్చించామన్నారు. దీనిపై వర్కింగ్‌కమిటీలో చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల దిగ్విజయ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ బేటీ అనంతరం ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఇక ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీయేనని తెలిపారు. కోర్‌ కమిటీలో చర్చించిన అంశాలపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమై విస్తృతంగా చర్చించింది. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి కోర్‌ కమిటీ నివేదించింది. కోర్‌ కమిటీలో చర్చించిన అంశాలపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని దిగ్విజయ్‌ మీడియాకు వెల్లడించారు. ఇదిలావుంటేసుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ ముగిసింది. ఇందులో ప్రధానంగా తెలంగాణ అంశం, 2014 ఎన్నికలపై కోర్‌కమిటీ సభ్యులు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు సమర్పించిన రోడ్‌మ్యాప్‌లపై నేతలు విస్తృతంగా చర్చించారు. ప్రధాని నివాసంలో తెలంగాణ అంశంపై చర్చించేందుకు భేటీ అయిన కాంగ్రెస్‌ వ్యూహ బృందం సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ప్రధాని నివాసంలో ఈ సమావేశం సాగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, షిండే, ఆంటోనీ, ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, అహ్మద్‌పటేల్‌.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. సీఎం, పీసీసీ చీఫ్‌, డెప్యూటీ సీఎంల వాదనలు విన్న తర్వాత కోర్‌ కమిటీ భేటీ మరో అరగంట సేపు కొనసాగింది. ఢిల్లీలో భారీవర్షం కురుస్తుండడంతో మీడియా ప్రధానమంత్రి ఇంటి బయట ఉన్న మీడియా నుంచి తప్పించుకునేందుకు దోహద పడింది. సాధారణంగా కోర్‌కమిటీ నిర్ణయాలు మాత్రం బయటకు చెప్పే అవకాశాలు తక్కువే. ఏనాడుకూడా కోర్‌కమిటీ నిర్ణయాలు మీడియాకు చెప్పిన దాఖలాలు లేనేలేవు. బయటకు వచ్చిన రాష్ట్ర నేతలు వారు మకాం చేసిన ప్రాంతాలకు వెల్లిపోయారు. సీఎం, డెప్యూటీ సీఎంలు వారు బస చేస్తున్న ఏపీ భవన్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం ఆయన సతీమణి ఎంపీిగా ఉన్నందున ఆ నివాసానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాబోయే 2014 ఎన్నికలలో పార్టీ గెలుపోటములపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కోర్‌కమిటీ సమా వేశంలో డిప్యూటి సిఎం 40 నిమిషాలు, సిఎం 45 నిమిషాలు, పిసిసి చీఫ్‌ 30 నిమిషాల సమయం తీసుకున్న ట్లు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణలు జరిగాయని ఏఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రధాని నివాసంలో సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చిస్తుండగా ప్రధాని నివాసం వద్ద ఓయూ విద్యార్థి ఐకాస, సమైక్యాంధ్ర ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఐకాస నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కాంగ్రెసు పార్టీ కోర్‌ కమిటీ భేటీకి బయలుదేరే ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు కత్తిని బహూకరించారు. ఆయన నుదుట తిలకం దిద్ది వారు కత్తిని బహూకరించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణలు కోర్‌ కమిటీ భేటీకంటే ముందు రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్‌ సింగ్‌, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌లతో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నివాసానికి దామోదర చేరుకున్న కాసేపటికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చారు. ఆ తర్వాత కిరణ్‌, బొత్సలు ఒకే కారులో వచ్చారు. ముఖ్యమంత్రి విభజిస్తే వస్తే నష్టాలను వివరించే అవకాశాలున్నాయంటున్నారు. అంతకుముందు ఆయన సోనియాను ఆమె నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ ఉందని, అయితే విభజిస్తే మాత్రం కాంగ్రెసు తెలంగాణ ప్రాంతంలో లాభపడదని, పైగా సీమాంధ్రలో నష్టపోవాల్సి ఉంటుందని కిరణ్‌ నివేదికలో ఉన్నట్లుగా సమాచారం. రాయల తెలంగాణ ఇస్తే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆయన నివేదికలో ఉందంటున్నారు. విభజన వల్ల భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని బొత్స నివేదికలో ఉన్నట్లుగా సమాచారం. విభజన జరిగినా సాగునీరు తదితర వాటిల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని, అవన్నీ అపోహలేనని దామోదర తన నివేదికలో పొందుపర్చినట్లుగా సమాచారం. నక్సల్స్‌ తదితర సమస్యలను పరిష్కరించుకుంటామని, తెలంగాణలో ఉన్న సెటిలర్లకు ఇబ్బందులు తలెత్తవని నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.

కోర్‌ కమిటీ భేటీ సమయంలో ప్రధాని నివాసం ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. విభజించాలని ఓయు నేతలు, విభజించవద్దంటూ సీమాంధ్ర విద్యార్థి నేతలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని తరలించే సమయంలో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

తుది దశకు : రాజయ్య

తెలంగాణపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నదని ఎంపి రాజయ్య అన్నారు. తుదినిర్ణయం తీసుకునే దశకు అధిష్టానం పెద్దలు చేరుకున్నారని, సాయంత్రం జరగనున్న కోర్‌కమిటీ భేటీలో నిర్ణయం వెలువడడం తథ్యమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం ఖాయమని అన్నారు. కలిసి ఉండి పొట్లాడుకునే కంటే విడిపోయి కలిసిఉంటే మేలని అన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎటువంటి హానీ ఉండబోదని, తగిన రక్షణ కల్పిస్తామని చెప్పారు.

ధన్యవాదాలు : పొన్నం

తుదినిర్ణయం తీసుకోనున్న అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంపి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నట్టుగానే తుదినిర్ణయం ఉంటుందన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయేందుకు అందరూ సహకరించాలని కోరారు. రెండు రాష్ట్రాలు ఉండడంవల్ల ఎటువంటి నష్టం ఉండబోదన్నారు. మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సోదరుల్లాగా సహకరించాలని సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులను కోరుతున్నానని అన్నారు.

ఎక్కడున్నా తెలుగువాళ్ళమే : గీతారెడ్డి

తెలుగువాళ్ళ సంస్కృతి ఎక్కడున్నా ఒక్కటేనని మంత్రి గీతారెడ్డి అన్నారు. తెలుగువాళ్ళు దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నారన్నారు. మనమంతా ఎక్కడున్నా తెలుగు వాళ్ళమేనని అన్నారు. విడిపోయి కలిసి ఉండడమే మేలని అన్నారు. తెలంగాణ ప్రజలు విడిపోదామనే భావనతో ఉన్నారని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటున్నామన్నారు.

ప్యాకేజీ ఉండదు : సునీత

ప్యాకేజీ ప్రస్థావనే రాదని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమా, రెండుగా విభజించడమా అన్న విషయాలపైనే తుదినిర్ణయం ఉంటుందని, అంతకు మించి వేరే అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్థావనకు రాబోవని చెప్పారు. అన్నదమ్ముల్లా విడిపోవడమే మంచిదని అన్నారు. తప్పకుండా తెలంగాణ వస్తుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

9వ తేదీ ప్రకటనకు అనుగుణంగా : షబ్బీర్‌ అలీ

తెలంగాణపై తుదినిర్ణయం వెలువడే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ అన్నారు. 2009, డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అన్నదముల్లా విడిపోయి ప్రేమతో కలిసి ఉండడమే మంచిదని అన్నారు.

ఎపి భవన్‌లో భారీ బందోబస్తు

కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ కానున్న నేపథ్యంలో ఎపి భవన్‌ వద్ద శుక్రవారం భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులను భారీ సంఖ్యలో మొహరింపజేశారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు మకాంవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నిర్ణయం వెలువడే అవకాశం ఉండడంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.