తెలంగాణ ఇచ్చేద్దాం

జులై మాసాంతానికి సీడబ్ల్యూసీ

పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో బిల్లు

తెలంగాణపై కోర్‌కమిటీ కీలక నిర్ణయం

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఐదు సీట్లే

సొంత సర్వేలో వెల్లడి

‘జనంసాక్షి’కి ప్రత్యేకం

న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) :

తెలంగాణ ఇచ్చేద్దామని కాంగ్రెస్‌ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈనెలాఖరులోగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) నిర్వహించి అందులో తెలంగాణపై సమగ్రంగా చర్చించనన్నుట్లు తెలిసింది. ఆగస్టులో నిర్వహించే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. శుక్రవారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ కీలకనిర్ణయం త్ణీసుకుంది. దశాబ్దాల తరబడి నాన్చుతున్న తెలంగాణకు ముగింపు ఇస్తే తప్ప రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారవనే నిర్ణయానికి కాంగ్రెస్‌ వచ్చింది. తెలంగాణ సమస్యను తేల్చకపోతే పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఐదు లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశమున్నట్లు ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 42 లోక్‌సభ స్థానాల్లో సింగిల్‌ డిజిట్‌కు పార్టీ పడిపోయే పరిస్థితికి తెలంగాణ కారణమని నిర్ధారించుకున్న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నా సోనియాగాంధీ తెలంగాణపై తేల్చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఎవరు కాదన్నా తెలంగాణ ఇచ్చి తీరాలని సోనియా నిర్ణయానికి రావడంతో రాహుల్‌ కూడా ఆమె మాటకే కట్టుబడ్డారు. తెలంగాణపై కాంగ్రెస్‌ అధినేత్రిగా సోనియాగాంధీ తీసుకునే నిర్ణయమే కీలకం కావడంతో ప్రధాని, హోం మంత్రి సహా మరికొందరు అభ్యంతరం తెలిపినా అధినేత్రి నిర్ణయానికి చివరికి ఓకే చెప్పారు. మరో పది పదిహేను రోజుల్లో సీడబ్ల్యూసీ సమావేశమై రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ఇటు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, అటు పార్టీలోని అత్యున్నత స్థాయి వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అతిత్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని దిగ్విజయ్‌సింగ్‌ వెల్లడించారు. సంప్రదింపులు అయిపోయాయని, నిర్ణయమే మిగిలి ఉందని కూడా చెప్పారు. కాగా, ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్దన్‌ ద్వివేది కూడా దాదాపు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఆయా సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనపై ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీలోని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆ నిర్ణయం వల్ల రాజకీయంగా ప్రయోజనం దక్కించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో చర్చలు సాగుతున్నాయని తెలిపాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలా? రాయల తెలంగాణ ఇవ్వాలా. అన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నాయి. తెలంగాణ ఇవ్వడమా? ఇవ్వకపోవడమా? అన్నది పక్కనబెడితే.. ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగానే తెలంగాణపై రోడ్‌మ్యాప్‌తో పాటు 2014 ఎన్నికలకు రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకు రావాలని ముఖ్యమంత్రి, డెప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లను ఆదేశించినట్లు గుర్తు చేశాయి. 42 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు అత్యంత కీలకమని.. రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు సాధించడంతోనే 2004, 09 కేంద్రంలో అధికారం చేపట్టినట్లు పార్టీ వర్గాలు విశ్లేషించాయి. 2014లో అధికారంలోకి రావాలంటే రాష్ట్రం ఎంతో కీలకమని, అందుకే ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర విభజనపై నిర్ణయం ఉంటుందని తెలిపాయి. పార్టీ పటిష్టత, ఎదురయ్యే రాజకీయ ఇబ్బందులు, ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై సీడబ్ల్యూసీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని వెల్లడించాయి. రాష్ట్ర విభజనపై ఈ నెలాఖరులోగా స్పష్టమైన ప్రకటన రానుందని పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెప్పాయి.