తెలంగాణకు సంపూర్ణ మద్దతు


బిల్లు పెట్టిన, చర్చకు వచ్చినా సహకారం
పార్లమెంట్‌ లోపల వెలుపులా ఒకే వైఖరి
యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయి
రాష్ట్రపతి పాలన పెట్టండి
మతతత్వ సంస్థలను నిషేధించండి
బహెన్‌ మాయావతి
లక్నో, జూలై 14 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ప్రకటించారు. ఆదివారం లక్నోలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు జై కొట్టారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టినా, తెలంగాణ అంశం చర్చకు వచ్చిన సహకరిస్తామని అన్నారు. పార్లమెంట్‌ వెలుపలా, లోపలా ఒకే వైఖరి పాటిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటానికి ఎల్లవేళలా అండగా నిలుస్తామని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారని గుర్తు చేశారు.  తెలంగాణ సాధన కోసం వేయి మందికి పైగా విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారంటే ప్రత్యేక రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో తేటతెల్లమవుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు. అఖిలేశ్‌ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలు పేట్రేగి పోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా యూపీలో రాష్ట్రపతి పాలన విధించి శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడాలని కోరారు. యూపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినా రాష్ట్ర ప్రభుత్వం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని మతతత్వ సంస్థలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అన్ని మతతత్వ సంస్థలు ప్రజల్లో విషం చిమ్ముతూ విద్వేషాలకు కారణమవుతున్నాయని తెలిపారు. హిందుత్వ అతివాద సంస్థలతో ముప్పుపొంచి ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.