జైపాల్‌, దిగ్గిరాజా సమాలోచనలు తెలంగాణపై కీలక భేటీ

మాసాంతానికే సీడబ్ల్యూసీ

తెలంగాణ తప్ప మారేది ప్రత్యామ్నాయం కాదు

తేల్చిచెప్పిన జైపాల్‌

న్యూఢిల్లీ, జూలై 15 (జనంసాక్షి) :

తెలంగాణపై సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అందుకు కావాల్సిన చర్యలను ముమ్మరం చేసింది. పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. జైపాల్‌ నివాసానికి చేరుకున్న దిగ్విజయ్‌ ఆయనతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, తెలంగాణపై చర్చించారు. 40 నిమిషాల పాటు వారి సమావేశం కొనసాగింది. పది జిల్లాల్లోని నాలుగున్నర కోట్ల మంది ప్రత్యేక రాష్ట్రాన్ని బలంగా కోరుకుంటున్నారని, వారికి తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని జైపాల్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తేల్చాలని కోరారు. లేనిపక్షంలో తలెత్తే పరిస్థితులకు కాంగ్రెస్‌ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తించాలని అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారని, ఇంకా జాప్యం చేస్తే పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశముందని తేల్చిచెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే తలెత్తబోయే పరిస్థితులను ఆయనకు వివరించారు. సీమాంధ్ర ప్రాంత నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ యువత, విద్యార్థులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణపై జాప్యం చేయడం వల్ల వెయ్యికిపైగా బలిదానాలు చోటు చేసుకున్నాయని, వాటిని ఆపేందుకు పాలకపక్షంగా చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇస్తుందని ప్రజాప్రతినిధులు ఇంతకాలం చెప్పుకుంటూ వస్తున్నారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కనీసం నియోజకవర్గాల్లో అడుగు కూడా పెట్టలేరని చెప్పారు. దిగ్విజయ్‌ బదులిస్తూ సీడబ్ల్యూసీలో అందరి అభిప్రాయం తెలుసుకున్నాక పార్లమెంట్‌లో బిల్లు పెట్టే అవకాశముందని అన్నారు. తెలంగాణపై త్వరగా తేల్చాలని అధినేత్రి సోనియాగాంధీ పట్టుదలతో ఉన్నారని వివరించారు.