సాగదీస్తే సాగనంపుతాం


సీమాంధ్రులు సాధించింది జగన్‌, ఓబుళాపురం, బయ్యారం : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి) :
తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ ఇంకా సాగదీయాలనే చూస్తే ఆ పార్టీని ఈ ప్రాంతం నుంచి సాగనంపితీరుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని, ఒక్క జిల్లా తగ్గినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ డిమాండ్‌తో ఈనెల 25న హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. సాగదీస్తే.. సాగనంపుతాం అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో చైతన్న యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో తమ ఓపికను పరీక్షించొద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని స్పష్టం చేశారు. అసలు సీమాంధ్రులు ఇంతకాలం సాధించింది ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తమ దోపిడీని యథేచ్ఛగా సాగించుకునేందుకు వనరులను కొళ్లగొట్టిన చరిత్ర సీమాంధ్రులదని ఎద్దేవా చేశారు. అంతకుమించి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. ఇన్నాళ్ల సీమాంధ్ర సర్కారు అత్యంత అవినీతి పరుడైన జగన్‌ను, ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీని, తెలంగాణ వనరులను కొళ్లగొట్టే బయ్యారం గనులకు మించి ఇంకా ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. వారి దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగుతున్నారని మండిపడ్డారు.