కిరణ్‌ పక్కా తెలంగాణ వ్యతిరేకిలా వ్యవహరిస్తుండు

సమైక్య రాష్ట్రంలో నక్సల్స్‌ సమస్య లేదా?

సీఎంపై కేకే ఫైర్‌

హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) :

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకిలా వ్యవహరిస్తుండని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే నక్సల్స్‌ సమస్య పేట్రేగిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వొద్దని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొందరు కాంగ్రెస్‌ నేతలు ముఖ్యమంత్రి చుట్టూ తోకలుపుతూ తిరుగుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వీరంతా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా తెలంగాణ ద్రోహులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సిగ్గు ఉంటే సీఎం చుట్టూ తిరగబోరని అన్నారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడిందంటూ నివేదిక ఇచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి కాలేదని ఒప్పుకున్నట్టేనని కేకే అన్నారు. నక్సలిజం పుట్టినప్పుడు ముఖ్యమంత్రి పుట్టాడా అని ఆయన ప్రశ్నించారు. చిన్న పిల్లాడిలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా అహంకారంతో కుర్రకుంక వలె వ్యవహరిస్తున్నారని, ఇది ఆయన స్థాయికి తగినది కాదని అన్నారు. తెలంగాణ గురించి కేంద్ర ప్రభుత్వానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలేనన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు నక్సల్స్‌ సమస్య లేదా అని ఆయన ప్రశ్నించారు. కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిళ్లకు తలొగ్గి ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే 215 రోజుల సమయం దేనికని.. కేవలం నెల రోజుల సమయం సరిపోతుందని కేకే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణకు వ్యతిరేక మని కొందరు నేతలు చేస్తున్న ప్రచారంలో అర్ధం లేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ వనరులను దోచుకుని అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అంత ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ కుండా సీమాంధ్ర నేతలు కుటిల యత్నాలు చేస్తున్నారని అన్నారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్యాకేజీలు, రాయలతెలంగాణ ప్రతిపాదనలు అంగీకరించబోమని కేశవరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలను మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కేశవరావు అన్నారు.