పది జిల్లాల తెలంగాణే కావాలి

సాగిదీస్తే సాగనంపుడే : కోదండరామ్‌

హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) :

పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 25న తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. గురువారం నాచారంలోని ఏఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన సన్నాహక సమావేవంలో ఆమన మాట్లాడారు. శుక్రవారం వికారాబాద్‌ నుంచి తాండూర్‌ వరకు బస్సు యాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం తాండూర్‌లో భారీ బహిరంగ ఉంటుందని తెలిపారు. 22న నియోజకవర్గాల్లో దీక్షలు చేపడుతామన్నారు. 23న ఇంటింటికీ ప్రచారం, 24న ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. 25న ఇందిరాపార్క్‌ వద్ద గ్రేటర్‌ హైదరాబాద్‌ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నక్సలైట్‌ ఉద్యమంతో పోల్చడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణపై నిర్ణయం తీసుకుకోకుండా సాగదిస్తే సాగనంపుతామని హెచ్చరించారు.