మా గడ్డమీద మీ జాగీరా?


మంత్రుల నివాసాల ఎదుట ఓయూ జేఏసీ ధూం తడాఖ
హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :
మా తెలంగాణ గడ్డ, హైదరాబాద్‌ మీ జాగీరా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులను నిలదేసేందుకు విద్యార్థులు తరలివచ్చారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర మీటింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పడే సమయంలో సమావేశాలు నిర్వహించి తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని, తక్షణమే ఆ ప్రతిపాదన విరమించుకుని కేంద్రానికి సహకరించాలని కోరుతూ విద్యార్థులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో భారీగా బలగాలను మొహరించారు. సీమాంధ్ర నేతల్లారా బయటకు రండి తెలంగాణా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న కేంద్రానికి సంపూర్ణ మద్దతిచ్చి తమతో స్నేహ భావం కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈసందన్భంగా పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మద్య తోపులాట జరిగింది. పరిస్థితి కాస్తా ఉద్రిక్తంగా మారింది. సీమాంధ్ర మంత్రులు ఏమాత్రం అడ్డుపడ్డా కూడా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు లాక్కెల్లి వాహనాల్లో పడేశారు. అనంతరం వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.