ఐబీఎల్ నుండి తప్పుకునే యోచనలో షట్లర్లు
న్యూఢిల్లీ ,జూలై 25 : ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల జరిగిన ఆటగాళ్ళ వేలంపై ఇప్పటికే గుత్తా జ్వాల , అశ్విని పొన్నప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా పురుషుల డబుల్స్ ప్లేయర్స్ రూపేష్ కుమార్ , సాన్వే థామస్ లీగ్ నుండి తప్పుకునేందుకు సిధ్ధమవుతున్నారు. వేలంలో తమకు తక్కువ ధర పలకడమే దీనికి కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో వీరి జోడీని పుణెళి ఫ్రాంచైజీ 5 వేల డాలర్లకే దక్కించుకుంది. దీనిపై వీరిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు పలికన ధరను చూసి షాక్‌కు గురయ్యామని చెప్పారు. సీనియర్ ప్లేయర్లుగా భారత్‌కు ఆసియా , కామన్‌వెల్త్‌గేమ్స్‌లోనూ , సూపర్ సిరీస్ ఈవెంట్స్‌లోనూ ఎన్నో మంచి ప్రదర్శనలు చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధగా ఉందని రూపేష్ అన్నాడు. తమ బేస్ ప్రైస్ 15వేల డాలర్లు ఉంటుందని భావిస్తే… ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదన్నాడు. తామిద్దరం 15వేల డాలర్ల బేస్‌ప్రైస్ కాంట్రాక్ట్ పైనే సంతకాలు చేశామని , కనీస సమాచారం ఇవ్వకుండానే ధర తగ్గించడం అవమానించడమేనని వ్యాఖ్యానించాడు. సీనియర్లకు సరైన గౌరవం ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తే లీగ్‌లో తాము ఏ విధంగా ఆడాలో తెలియడం లేదని రూపేష్ చెప్పాడు.