యువజట్టులో మెరిసేదెవరో..

జింబాబ్వేతో రెండో వన్డేకు సిధ్ధమైన భారత్‌

హరారే ,జూలై 25  :జింబాబ్వే పర్యటనను గ్రాండ్‌ విక్టరీతో ఆరంభించిన భారత యువజట్టు రెండో వన్డేకు రెడీ అయింది. యంగ్‌ ఇండియా విజయంపై ఎవరికీ సందేహాలు లేకున్నా… సీనియర్ల స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న యువఆటగాళ్ళ ప్రదర్శనపైనే అందరి చూపు ఉంది. తొలి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగితే… వన్డే అరంగేట్రం చేసిన అంబటి రాయుడు హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మిగిలిన జట్టులో ఉన్న ఆటగాళ్ళు సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. జట్టులో మార్పులపై మ్యాచ్‌కు ముందే నిర్ణయం తీసుకునే అవకాశముంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు పూర్తి స్థాయిలో గాడిన పడేందుకు ఈ సిరీస్‌ చక్కని అవకాశం. ఈ నేపథ్యంలో ధావన్‌ , రోహిత్‌శర్మ తమదైన ముద్ర వేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. అటు బౌలింగ్‌లో సీనియర్లు లేకున్నా… యువపేసర్లు రాణిస్తున్నారు. ఉనాద్కట్‌ , వినయ్‌కుమార్‌ , మహ్మద్‌ షవిూ పేస్‌ భారాన్ని మోస్తుండగా… స్పిన్‌ విభాగంలో అమిత్‌మిశ్రా ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో 3 వికెట్లు పడగొట్టాడు. జడేజా , రైనా కూడా స్పిన్‌ భారాన్ని పంచుకుంటున్నారు. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థి కంటే బలంగా ఉన్న భారత్‌ మరోసారి పూర్తి ఆధిపత్యం కనబరిచి విక్టరీ కొట్టేందుకు ఎదురుచూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన జింబాబ్వే ఇంకా పోరాటపటిమ కనబరిచాల్సి ఉంది. బ్యాటింగ్‌లో సికిందర్‌ రాజా , చిగుంబరా తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. బౌలింగ్‌లోనూ ఆ జట్టు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే సిరీస్‌లో సంచలనాలు సృష్టించే సత్తా తమకుందని జింబాబ్వే కోచ్‌ చెబుతోన్న నేపథ్యంలో కొంచెం ఆసక్తి నెలకొంది.