జ్ఞానోదయమైంది మాట తప్పారు.. మడమ తిప్పారు


లక్ష కోట్లు వెనకేసుకున్నారు
రాళ్ల దెబ్బలు తినిపించారు
అవినీతి లిమిటెడ్‌ కంపెనీ మీది
జగన్‌కు ‘కొండా’ బహిరంగ లేఖ
హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కూడా కాదని సమైక్యవాది జగన్‌ పంచన చేరిన మాజీ మంత్రి కొండా సురేఖకు ఎట్టకేలకు జ్ఞానోదయమైంది. వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ పక్కా సమైక్య వాద పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకిస్తూ 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు పార్టీ నిర్ణయమేనని విమర్శించారు. లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు తెలంగాణపై మాట తప్పడం పెద్ద విషయం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణపై విూ విధానం ఎప్పుడు మార్చుకున్నారని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచే సలహాలిస్తూ పార్టీని భ్రష్టు పట్టించారని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ టికెట్లు అమ్ముకున్నారని, ప్రజాబలం లేని వారిని బ్రోకర్ల ద్వారా ఎమ్మెల్సీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోవడానికి బేరసారాలు చేపట్టారని విమర్శించారు. చాలాకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సురేఖ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం మరింత ఆగ్రహం కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె సోమవారం వైఎస్‌ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఘాటైన విమర్శలు, సూటి ప్రశ్నలతో నాలుగు పేజీల లేఖను విూడియాకు విడుదల చేశారు.సురేఖ లేఖలో జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌పై అభిమానంతో ఆయన కుటుంబానికి అండగా నిలబడితే.. జగన్‌, విజయమ్మ తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ వైపు నిలబడినందుకు తాను, తన భర్త పదవులను కోల్పోయామని. పార్టీ ఓ ఎమ్మెల్సీ అవకాశం వస్తే తన భర్తకు కాకుండా ఇతరులకు అమ్ముకున్నారని ఆరోపించారు. జగన్‌తో ఉన్న తాము ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామన్నారు. తమను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు నష్టపోయారని తెలిపారు. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందన్నారు. లక్షల కోట్ల సంపాదనే జగన్‌ ధ్యేయమని విమర్శించారు. ‘మాట తప్పడం, మడమ తిప్పమనేది వైఎస్‌ నినాదం, మాట తప్పుతాం, మడమ తిప్పుతామనేది మీ విధానమని’ తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌కు ఉన్న ఒక్క లక్షణం కూడా జగన్‌కు లేదని మండిపడ్డారు. లక్ష కోట్ల సంపాదనే ఆయన ధ్యేయమని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్సీ పదవులను రూ.7 కోట్లకు అమ్ముకున్నారని, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోవడానికి బేరసారాలు పెట్టారని ఆరోపించారు.
తెలంగాణపై స్పష్టత ఏది?
తెలంగాణపై వైఎస్సార్‌సీపీ వైఖరి ఏమిటని సురేఖ సూటిగా ప్రశ్నించారు. పార్టీ పక్కా సమైక్యవాద పార్టీగా మారిందని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని, కేంద్రం ప్రత్యేక రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తే అడ్డుపడబోమని పార్టీ ప్లీనరీలో చేసిన తీర్మానం ఏమైందని ఆమె నిలదీశారు. లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు తెలంగాణపై మాట తప్పడం పెద్ద విషయం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణపై విూ విధానం ఎప్పుడు మార్చుకున్నారు? విూది సమైక్యవాదమా? ఇడుపులపాయ తీర్మానమా? గతంలో చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? తెలంగాణపై పార్టీ నిర్ణయం ఎప్పుడు మార్చుకున్నారు? 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా విూ నిర్ణయం కాదా? విూకు తెలియకుండానే వారు రాజీనామాలు చేశారా? విభజన ఖాయమని తెలిసే సీట్ల కోసం ఆరాటపడుతున్నారా?’ అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణపై అభిప్రాయం ఎప్పుడు మార్చుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
లిమిటెడ్‌ కంపెనీగా పార్టీ
వైఎస్సార్‌సీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మారిపోయిందని సురేఖ విమర్శించారు. జైలు నుంచి సలహాలు ఇస్తూ పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు. ‘విూరు (జగన్‌) జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారిపోయింది. కొందరు నాయకులు బ్రోకర్ల అవతారమెత్తి ఎమ్మెల్సీ టికెట్లు అమ్ముకున్నారు. ఎమ్మెల్యే టికెట్లకు బేరసారాలు పెట్టారు. గతంలో వైఎస్‌కు మద్దతుగా నిలబడిన వారిని పక్కనబెట్టి పార్టీలో బ్రోకర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని’ వ్యాఖ్యానించారు.