హైదరాబాద్ తెలంగాణకే
సీమాంధ్రుల రాజధాని నిర్మించే వరకే ఉమ్మడిగా..
మరింత స్పష్టత ఇచ్చిన దిగ్విజయ్
న్యూఢల్లీి, జూలై 31 (జనంసాక్షి) :
హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణదేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడిరచారు. సీమాంధ్రుల కోసం రాజధాని నిర్మించే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం నాటి ఏఐసీసీ ప్రకటన తర్వాత హైదరాబాద్‌పై నెలకొన్న సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విభజన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన రెండు ప్రాంతాలకు మంచిదేనని అన్నారు. తెలంగాణ బిల్లు త్వరగా ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందని చెప్పారు. బుధవారం ఆయన భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే ఉంటుందన్నారు. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎందుకు అనవసరమైన భయాలు, అర్థం లేని అపోహలకు గురవుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. సీమాంధ్రులు అనవసరమైన భయాలను వీడాలని సూచించారు. హైదరాబాద్ ఓటర్ల జాబితాల పేరు నమోదై ఉంటే వారంతా తెలంగాణ వాసులుగానే గుర్తింపు పొందుతారన్నారు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారీ వరకూ దేశంలోని ప్రతి భారతీయుడికి ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు, ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసే హక్కు ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించిందని దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం వల్ల సీమాంధ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. కొత్త ప్రాంతానికి రాజధాని ఏర్పాటు చేసేంత వరకూ హైదరాబాద్ రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు. రెండు రాష్టాల్రు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశంపై దిగ్విజయ్ మరింత స్పష్టతనిచ్చారు. ఉమ్మడి రాజధాని విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత తెలంగాణ రాజధానిగా ఉంటుందన్నారు. కోస్తా ప్రాంతం తీర ప్రాంతమని, అక్కడ భారీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. అందుకే సీమాంధ్ర అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కూడా అదనంగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అంటే కుటుంబాన్ని విభజించినట్లేనని, సంతోషకరమైన చర్య కాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కానీ, మూడు ప్రాంతాల ప్రజల కోసం విభజించక తప్పలేదని చెప్పారు.