ఆంటోనీ కమిటీకి చెప్పుకోవడమే పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉద్యమం వాస్తవికతకు బహుదూరంలో ఉంది. సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లోని మీడియా ఆ ఉద్యమానికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేస్తోంది. కొన్ని చానెళ్లయితే తమ రెగ్యులర్ కార్యక్రమాలకు స్వస్తి పలికి సీమాంధ్ర ఉద్యమాన్నే పదే ప్రసారం చేస్తున్నాయి. ఈ క్రమంలో మీడియా నైతిక నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఆందోళనలు యథాతథంగా ప్రసారం చేయడం ద్వారా వాటి ప్రభావం మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశమున్నందున మీడియా ఇలాంటి కథనాల ప్రచురణ, ప్రసారం విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి. తెలంగాణకు సంబంధించి వాస్తవ, విధాన సంబంధ అంశాలతో కేబినెట్ నోట్ సిద్ధమవుతోందని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం రాజ్యసభలో చేసిన ప్రకటనతో ఇక తెలంగాణ ఏర్పాటుకు కార్యాచరణ సిద్దమవుతోందన్న వాస్తవం స్పష్టమయ్యింది. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి భారత రాజ్యాంగం స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించిందని, ఆ ప్రకారమే పక్రియ కొనసాగుతుందని , అన్ని అంశాలతో సమగ్రమైన కేబినెట్ నోట్ రూపొందుతుందని, ఆ తర్వాత దానిపై చట్టసభ నిర్మాణాత్మక చర్చ జరపవచ్చని చిదంబరం స్పష్టంగా వివరించారు. ఈ దశలో సీమాంధ్రలో చేస్తున్న ఆందోళన చూస్తుంటే పనిగట్టుకుని ఎగదోస్తున్న ఉద్యమం తప్ప మరోటి కాదు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఎన్నోమార్లు కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వేలసార్లు బహిరంగంగా చెప్పారు. పిసిసి చీఫ్ బొత్సతో పాటు రాష్ట్ర కేంద్రమంత్రులు ఢంకా బజాయించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. అలాంటి వారు ఇవాళ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే సమ్మతం కాదంటున్నారు. అసలు తెలంగాణ ఏర్పాటు సమ్మతం కాదంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా హైదారబాద్ కావాలంటున్నారు. ఇక్కడ ఉన్న లక్షల ఎకరాలను అప్పనంగా కాజేసి స్థానికులకు గుంటెడు జాగా లేకుండా చేసిన వారు హైదరాబాద్‌ను చమటోడ్చి కట్టారని చెప్పుకోవడం సిగ్గుగాక మరోటి కాదు. దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికి సిద్దమవుతున్న వారు చేసే ఉద్యమాలకు భయపడాల్సిన పనిలేదు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతందని, సచివాలయంలో నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగులు ఉన్నారంటే ఎవరూ లేరని గతంలో ప్రభుత్వాలు బుకాయించాయి. మరి సచివాలయంలో ఆందోళనకు దిగిన వారు ఎక్కడి నుంచి వచ్చినట్లు? ఇవన్నీ నిజాలు.. వీటిని కప్పిపుచ్చలేం. ఏళ్ల తరబడి అన్యాయానికి, వివక్షకు గురవుతున్న తెలంగాణ సమాజం 60 ఏళ్ల పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాఫల్యం చేసుకుంటే అక్కసుతో తిరగబడుతున్నారు. బలవంతంగా కలసి ఉండాలని కొందరంటారు. హైదరాబాద్‌ను ఉమ్మడిగా ఉంచాలని కొందరంటారు. కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరంటారు. రాయల తెలంగాణ ఇంకొందంరంటారు. బహుశా ఇంతగా ఈ ప్రాంతం దోపిడీకి గురికాకుంటే, ఇక్కడ అప్పనంగా ఆస్తులు కాజేయకుంటే వీరికి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు వచ్చి ఉండేవి కావు. తెలంగాణ విషయంలో అంటే విభజనకు సంబందించి సరైన సమయంలో ప్రభుత్వం చర్చను స్వాగతిస్తుందని ఆర్థికమంత్రి చిదంబరం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఆంధప్రదేశ్‌లోని సీమాంధ్రకు చెందిన ఎంపీలు గందరగోళం సృష్టిస్తూ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రకటన చేయాలంటూ డిమాండ్లు లేవనెత్తారు. ఎంపీలు గందరగోళం కొనసాగిస్తుండగానే మంత్రి చిదంబరం ప్రభుత్వ ప్రకటనను చదివి వినిపించారు. కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అనారోగ్యంతో ఉండటంతో కొన్ని రోజులపాటు చిదంబరం ఆ బాధ్యతలను చూడనున్నారు. అందులో భాగంగానే ప్రకటన చేశారు. నదీజలాల్లో వాటాలు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, మూడు ప్రాంతాలకు చెందిన ప్రజల రక్షణ, భద్రత, ప్రాథమిక హక్కుల పరిరక్షణ తదితర అంశాలన్నింటిని నోట్‌లో చేరుస్తామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఆందోళన కలిగిస్తున్న వాస్తవ, విధానపరమైన అంశాలపై సమగ్రమైన నోట్ రూపొందుతోందని చెప్పారు. అంటే స్పష్టంగా వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ఓ రాష్ట్రాన్ని విభజించే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ కొత్త రాష్ట్ర ఏర్పాటు జరగడం లేదన్న విషయాన్ని ఆందోళన చేస్తున్న వారు, చేయిస్తున్న వారు గుర్తించాలి. గతంలో కలిపిన తెలంగాణను తిరిగి వేరు చేస్తున్నారు. గతంలో బలవంతంగా కలిపినప్పుడు అన్ని హామీలను తుంగలో తొక్కారని గుర్తుంచుకోవాలి. నిజాలను ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇదేదో భారత్‌నుంచి విడిపోతున్న కారణంగా జరుగుతన్న ఆందోళనగా చిత్రీకరించవద్దు. నిజానికి పాక్ భారత్ నుంచి విడిపోతున్న సందర్భంలో కూడా ఇంతగా ఆందోళ చేసి ఉండని వారు ఈ ఆందోళన చేస్తున్నారు. మద్రాస్ నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో సీమాంధ్రప్రాంత ప్రజలకు తెలియంది కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి చూస్తే, కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై భారత రాజ్యాంగం విధివిధానాలను నిర్దేశించింది. కొత్త రాష్ట్ర ఏర్పాటుతో అనేక వాస్తవిక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. నదీజలాలను పంచుకోవడం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, మూడు ప్రాంతాల నివాసులందరి రక్షణ, భద్రత, నివాసులందరి ప్రాథమిక హక్కులకు హావిూ.. ఇవన్నీ ఉంటాయి. కేవలం హైదరాబాద్ తప్ప మరోటి వీరికి కానరావడం లేదు. తమ ప్రాంత ప్రజల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న నేతల కుటిల రాజకీయాన్ని ప్రలు గమనించాలి. ప్రత్యేక రాష్ట్రంగా అద్భుతంగా అవతరించే సీమాంద్ర అభివృద్దిని వీరు కావాలనే కాలరాచుకుంటున్నారన్న నిజాన్ని ప్రజలు గుర్తించాలి. తమకేమన్న సందేహాలుంటే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీకి నివేదించుకోవాలే తప్ప అనవసర రాద్ధాంతాలతో ప్రయోజనం ఉండదు. ఇది సీమాంధ్రులు గుర్తిస్తే మంచిది.