భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలుతెలుగుజాతి ముద్దుబిడ్డలు
బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన వారిలో మన రాష్ట్రానికి చెందిన ముద్దుబిడ్డలు ఉండటం తెలుగుజాతి గర్వించదగిన అంశం. 1857లో బ్రిటిష్ రెసిడెన్సీ మీద సాయుధులై దండెత్తిన దళాలకు నాయకుడు పఠాన్ తుర్రేబాజ్ ఖాన్, జూలైలో మెదక్ సమీపాన బ్రిటిష్ సైన్యంతో పోరాటం జరిపారు. ఈ పోరులో సహచరు లందర్నీ కోల్పోయిన ఆయన శత్రువు చేత చిక్కరాదన్న పట్టుదలతో ప్రయత్నించారు. శతృసైన్యాల కళ్ళుగప్పి అందర్థానమయ్యారు. ఆయన కోసం అన్వేషణ సాగింది. ఆయనను బంధించి అప్పగించిన వారికి అప్పట్లోనే ప్రభుత్వం 5 వేల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అతి ప్రయాస మీద బ్రిటిషు సైనికులు ఆయనను అరెస్టు చేశారు. ఆ యోధుడ్ని చిత్రహింసలకు గురి చేసి, ఉరిశిక్ష విధించారు. బ్రిటిషు వ్యతిరేక పోరుకు నాయకత్వం వహించి నందుకు తుర్రేబాజ్ ఖాన్‌పై కసితీరని బ్రిటిష్ పాలకులు ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం హైదరాబాదులోని సుల్లాన్ బజారు పోలీస్ స్టేషన్ సెంటర్‌లో బహిరంగంగా వ్రేలాడదీసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
ఆ బాటలో నడిచి, తుర్రేబాజ్ ఖాన్‌కు అండదండలు అందించిన మౌల్వీ అల్లావుద్దీన్‌ను అరెస్టు చేసి ద్వీపాంతరం వాసానికి పంపారు. ఆ క్రమంలో సయ్యద్ అహమ్మద్ 1857జూలై 17న పోరుసల్పుతూ ప్రాణాలు విడిచారు. బోయనపల్లిలో బ్రిటిష్ సైనికాధికారి కల్నల్ డేవిడ్‌సన్‌ను చంపే ప్రయత్నంలో జహంగీర్ ఖాన్ అను మరో యోధుడు కాల్చివేయబడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం బ్రిటిషు సైన్యంలో సైనికాధికారిగా పనిచేస్తున్న సుబేదార్ అహమ్మద్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటులో అహమ్మద్ వెంట నడిచిన తిరుగుబాటు సిపాయిలందర్ని ఆయన కళ్ళ ముందే కాల్చ చంపేశారు. చివరకు సుబేదార్ అహమ్మద్ ఫిరంగి గొట్టపు రంధ్రానికి కట్టి పేల్చి వేశారు. ఈ మేరకు బ్రిటిషు వారికి వ్యతిరేకంగా సాగిన పలు పోరాటాలలో పాల్గొన్న యోధులు ఎంతో మంది ఉన్నారు. ఈ వీరులంతా తెలుగు గడ్డకు చెందినవారు కావటం గర్వించదగిన అంశం.
పాత్రికేయుడు మహమ్మద్ బాకర్ త్యాగం
1857లో నాటి ప్రథమ స్వాతంత్రోద్యమంలో ఆనాటి పత్రికలు కూడా బృహత్తరమైన పాత్రను నిర్వహించాయి. ఆనాడు ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగానూ, ఇతర ప్రాంతాల నుండి ‘ఢిలీకల అక్బార్’, ‘కొహినూర్’, ‘తారిఖ్ ఏ భగవత్ ఏ హింద్, ‘ముషిర్ ఏ దక్కన్’, ‘వకీల్’ వంటి పలు పత్రికలు బ్రిటిష్ వ్యతిరేకతను ప్రజానీకంలో ప్రోది చేస్తూ సాహసవంతమైన పాత్రను పోషించాయి.
ప్రథమ స్వాతంత్య్ర సమరానికి తిరుగులేని మద్దతునిస్తూ తిరుగుబాటుదార్లలో బ్రిటిష్ పాలకుల పట్ల తీవ్ర ప్రతిఘటన జ్వాలలను మండించింది ”ఢిల్లీ అక్బార్” పత్రిక. బ్రిటిష్ పాలకులు ఆ పత్రిక సంపాదకులైన మౌల్వీ మహమ్మద్ బాకర్‌ను 1858లో అరెస్టు చేసి దారుణ చిత్రహింసలకు గురిచేసి హత్యగావించారు. ఈ విథంగా పత్రికా స్వేచ్చకై ప్రాణాలర్పించిన తొలి పాత్రికేయులుగా మహమ్మూద్ బాకర్ చరిత్రలో నిలిచిపోయారు.
ఆనాటి పత్రికలన్నీ విదేశీ పాలక శక్తుల మీద తమ అక్షరాయుధాలను ప్రయోగంచటంతో భీతిల్లిన పాలకులు పత్రిక లను నిషేధించి, సంపాదకులను, ప్రచురణ కర్తలనేకాక, పాఠకు లను కూడా తీవ్ర నిర్భంధాలకు గురి చేశారు. ఈ కారణంగానే 1853 నాటికి ఉన్న 35 ఉర్దూ పత్రికలు కాస్తా 1858 నాటికి 12కు తగ్గిపోయాయంటే బ్రిటిష్ పాలకులు ఎంత క్రూరంగా వ్యవహరించారో తేలిగ్గానే ఊహించవచ్చు.
ముస్లింల ఊచకోత
ప్రధమ స్వాతంత్య్ర సమరాన్ని ప్రారంబించినవారు, పాల్గొన్నవారు, ప్రోత్సహించిన వారు ప్రధానంగా ముస్లింలేనన్న అభిప్రాయాని కొచ్చిన బ్రిటిష్ పాలకులు 27 వేల మంది ముస్లింను వివిధ ప్రాంతాలలో ఉరితీశారని చరిత్ర రికార్డులు చెబుతున్నాయి. ఈ సంఖ్యకంటే అనేక రెట్లు ఆనాడు జరిగిన సామూహికక హత్యా కాండంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి ముస్లిం కులీన వర్గాలతోపాటు, సామాన్య ప్రజానీకాన్ని కూడా అన్ని విధాలుగా కృందీసి నిర్వీర్యం చేసేందుకు అనువైన పథకాలు, విధానాలు బ్రిటిష్ పాలకులు అమలుపర్చారు. ఆనాడు అమలు చేసిన పథకాలు దుష్పరిణామాల ఫలితం ఈనాటికీ కూడా భారతీయ ముస్లింల వెనుకబాటు తనంలో ప్రతిఫలిస్తుంది.
ఆనాడు హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్య నెలకొన్న బలమైన ఐక్యతను చూసి పాలకులు కలవరం చేందారు. ఈ రెండు సాంఘీక జన సముదాయాలను చీల్చేందుకు కుట్రపూరితంగా వ్యవహ రించారు. చరిత్రను వక్రీకంరించారు. ముస్లిం పాలకుల కంటే తమ పాలన మెరుగైనదన్న అభిప్రాయం భారతీయులలో కలుగు చేసేందుకు ఆంగ్లేయ చరిత్రకారులు గ్రంథ రచన సాగించారు. ముస్లిం పాలకులు పరమత విద్వేషులుగా, రాక్షసులుగా చిత్రీకరిస్తూ చరిత్ర రచన గావించారు. ఆ విధంగా వక్రీకరణ, చిత్రీకరణలకు గురైన చరిత్ర ఆధారంగా ఆ తరువాత కాలంలో భారత చరిత్ర రచన సాగటం వలన సహజంగానే స్వదేశీ చరిత్రకారులు ఆ ప్రభావానికిలోనై, ముస్లింల బ్రిటిష్ వ్యతిరేక వీరోచిత గాధలను విస్మరించారు.
భారత జాతీయ కాంగ్రెస్‌లో బృహత్తర పాత్ర
ప్రధమ స్వాతంత్య్ర సమరం తరువాత సు మారు మూడు దశాబ్దాల కాలం ముగియకముందే 1885లో ఏర్పడిన భార త జాతీయ కాంగ్రెస్ జాతీయోద్యమ నాయ కత్వాన్ని స్వీకరించింది. ఆనాటి తొలిదశ నుండి మలిదశ వరకు భారతీయ ముస్లింలు లక్ష్యసాధనలో చారిత్రాత్మక పాత్ర నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తొలిదశలో బద్రుద్దీన్ తయ్యాబ్జీ, రహమతుల్లా సయాని లాంటి ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు. మౌలానా షబ్లీనోమాని కాంగ్రెస్ పక్షాన పూర్తిగా నిలిచారు. మీర్ హుమాయూన్ కర్మాన్ లాంటి సంపన్నులు జాతీయ కాంగ్రెస్‌కు అప్పట్లోనే 5 వేల రూపాయలు విరాళం సమర్పించారు. అలీ మహమ్మద్ భీంజీ లాంటి ప్రముఖులు దేశమంతటా విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అవిశ్రాంత కృషి సల్పారు.
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో క్రియా శీలక పాత్ర నిర్వహించిన కారణంగా ఆంగ్లేయుల దాష్టికానికి గురై పలు ఇక్కట్లుపడుతున్న ముస్లిం జనసముదాయాల సముద్దరణ పాలకుల తో పేచీపెడివతే సాధ్యం కాదని భావించిన మేధావులు సర్ సయ్యద్ అహమ్మద్, సయ్యద్ అమీర్ అలీ లాంటి ప్రముఖులు భారత జాతీయ కాంగ్రెస్‌లో ముస్లింల చేరికను వ్యతిరేకించారు. ఈ మేరకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జాతీయ కాంగ్రెస్‌ను సమర్థిస్తున్న ప్రముఖుల మీద విమర్శలు గుప్పించారు. ఆ విమర్శల కు జస్టిస్ బద్రుద్దీన్ తాయ్యాబ్జి, రహిమతుల్లా యం సయాని లాంటి వారు తగురీతిన సమాధానాలిస్తూ అత్యంత సాహసోపేతంగా ముందుకు ఉపక్రమించారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఈ నేతలు సాగించి కృషి వలస ఇతర జనసముదాయాలతో పాటుగా ముస్లింలు కూడా జాతీయ కాంగ్రెస్ భవిష్యత్తుకు పునాదిరాళ్ళ య్యారు.
ఆ తరువాత కాలంలో జస్టిస్ బద్రుద్దీన్ తయ్యాబ్జి, రహిమతున్లా యం సయాని, మౌల్వీ మజహరుల్ హఖ్, డాక్టర్ యంఎ అన్సారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్, నవాబ్ సయ్యద్ బహుదూర్, హసన్ ఇమాం లాంటి పలువురు ప్రముఖులు అధ్యక్షస్థానాన్ని చేపట్టారు. జాతీయోద్యమం కీలక దశల గుండా సాగుతున్నప్పుడు సమర్థవంతంగా ఈ నేతలు తమ పాత్రను నిర్వహించి ఉద్యమానికి ప్రాణం పోశారు. ఆ క్రమంలో మౌలానా ఆజాద్ 1923లో తన 35 ఏండ్ల వయస్సులో అధ్యక్షస్థానాన్ని చేపట్టడమే కాక 1940 మరోసారి కాంగ్రెస్ అధ్యక్షపీఠం అలంకరించి,. ఏడు సంవత్సరా పాటు ఆయన ఆ పదవిలో ఉండి చరిత్ర సృష్టించారు.
-సయ్యద్ నాసిర్ అహమ్మద్
(తరువాయి భాగం రేపటి సంచికలో)