మీరు మా నగరానికొచ్చింది లాభార్జనకే.. అభివృద్ధికి కాదు


-చీమలన్నీ పుట్ట నిర్మించుకున్నట్టు హైదరాబాద్‌ మేం నిర్మించుకున్నం
-విషసర్పంలా మీరొచ్చి సొచ్చారు
-అడ్డగుట్ట, బొందలగడ్డలు మాకా?
-జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ మీకా?
-మీరు కబ్జాపెట్టిన ల్యాంకో హిల్స్‌ సంగతేంది?
-మా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌పై ఎన్టీఆర్‌ పార్క్‌ , ఐమాక్స్‌ నిర్మించారు
-గోల్కొండ, హైదరాబాద్‌కు రాల్లెత్తినం
-హైదరాబాద్‌ ముమ్మాటికీ మా తాత జాగీరే
-కరెంట్‌ వెలుగులు చూసిందే మేం
-ఆర్టీసీ మా నిజాంది.. బేగంపేట ఎయిర్‌పోర్టు మాదే
-ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్‌ వజ్రం కూడా మాదే
హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) :
గోల్కొండ, హైదరాబాద్‌ స్టేట్‌..
కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలనలో సర్వతోముఖాభివృద్ధి చెందిన ప్రాంతాలు. గోల్కొండకు, హైదరాబాద్‌ స్టేట్‌కు, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి రాజధా నిగా రెండు శతాబ్దాలకుపైగా ఉన్న హైదరాబాద్‌ 19వ దశకం ప్రారం భం నాటికే ప్రపంచ శ్రేణి నగరం. దేశంలోనే అభివృద్ధి పరంగా నాలు గో అభివృద్ధి చెందిన నగరం. మొదట కుతుబ్‌షాహీలు, తర్వాత అసఫ్‌ జాహీలు నగర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. పారిశ్రామిక వాడలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించారు. ప్రజా రవాణాకు రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌, హైదరా బాద్‌లో అప్పటికే వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పిన గుజరాతీలు, బెంగాలీలు, సింధీలు, మహారాష్ట్రీయులు, సిక్కులు, కేరళీయులు, కన్నడీగుల సత్వర రవాణా, పాలనపరమైన చర్యల వేగవంతానికి పౌర వైమానిక సేవలు ఏర్పాటు చేసుకున్న రాజ్యం హైదరాబాద్‌. ఇప్పటి సీమాంధ్రులు గుడ్డిదీపం వెలుతురులో కాలం గడుపుతున్న రోజుల్లోనే హైదరాబాద్‌లో విద్యుత్‌ ఉత్పత్తి పరిశ్రమ నెలకొల్పి ప్రజలకు కరెంట్‌ వెలుగులు ప్రసాదించారు. ప్రజలు కట్టిన పన్నులతో నిజాం రాజు మాత్రమే భోగభాగ్యాలు అనుభవించలేదు. ప్రజలందరికీ సకల సౌకర్యాలు కల్పించారు. నిజాం రాజ్యం ఆర్థిక పరిపుష్టతకు, వైభవానికి నిదర్శనం కోహినూర్‌ డైమండ్‌. ఇప్పుడు ఇంగ్లడ్‌ రాణి కిరీణంలో కాంతులీనుతున్న కోహినూర్‌ డైమండ్‌ మా సొంతం. చారిత్రక గోల్కొం డకు, ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాద్‌కు రాల్లెత్తిన కూలీలు మా తాతలు. చీమలన్నీ కూడి పుట్టలు పెట్టుకున్నట్టు మేం హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించుకుంటే విషసర్పాలు వచ్చి వాటిలో చేరినట్టు అభివృ ద్ధి చెందిన, సకల సంపదలతో కూడిన హైదరాబాద్‌ను ఆక్రమించు కుంది సీమాంధ్రులు. హైదరాబాద్‌లో వ్యాపారానికి, ఉద్యోగాలకు, ఇక్కడి వనరులు కొళ్లగొట్టి సంపన్నులు కావడానికి వచ్చింది సీమాం ధ్రులు. వారు వచ్చిందే లాభార్జనకు. ఇందుకోసం హైదరాబాద్‌ చారిత్రక నేపథ్యాన్ని ధ్వంసం చేశారు. మా తాతల జాగీర్‌ హైదరాబా ద్‌ను పీల్చిపిప్పిచేశారు. అడ్డగుట్ట, చాదర్‌గాట్‌లాంటి బొందలగడ్డలు మనకు విడిచిపెట్టి బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌ను ఆక్రమించేశారు.సర్వసంపన్న హైదరాబాద్‌ను 19వ శతాబ్దం మొదట్లో చూడటానికి రెండు కళ్లు సరిపోయేవి కాదంటే అతిశయోక్తి కాదు. బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, అఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ ఆనాటి హైదరాబాద్‌ అంతర్జీయ హోల్‌సేల్‌ మార్కెట్‌కు సజీవ సాక్షం. ఇక్కడ వ్యాపారాలు నిర్వహించిన వారిలో పెక్కుమంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే. కానీ అంతా కలిసిమెలిసి జీవిం చడం హైదరాబాద్‌ సంస్కృతికి, అతిథులను గౌరవించే సంప్రదా యానికి తార్కాణం. ఇలాంటి హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తర్వాత అన్ని రకాలుగా విధ్వంసం చేసిన వారు సీమాంధ్రులు.1591లో ఆవిర్భవించిన హైదరాబాద్‌ 1763లో ఈ ప్రాంత రాజధాని అయింది. హైదరాబాద్‌ రాజధాని కాకపూర్వమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతం. అసఫ్‌జాహీల పాలన ప్రారంభమయ్యాక హైదరాబాద్‌ అభివృద్ధి మరింత వేగవం తమయింది. విద్యాలయాలు, పరిశ్రమలు, వైద్య సేవలు, చారిత్రక కట్టడాలు, గ్రంథాలయాలు, పౌర రవాణా, ప్రజోపయోగ సేవలు అన్ని రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్‌ నగర నిర్మాణానికి ముందే మంచినీటి కోసం 1562లోనే హుసేన్‌సా గర్‌ నిర్మించారు. 1862లోనే ఇక్కడ పోస్టాఫీస్‌ ద్వారా తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి. 1890లో యునానీ, ఆరుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 1856లోనే విద్యావ్యాప్తి పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1871లో సింగరేణి, ఆ వెనువెంటనే తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అసఫ్‌జాహీలు హైదరాబాద్‌ పరిసరాల్లోనే ఐదు వందలకు పైగా పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించారు.
హుస్సేన్‌ సాగర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ :
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు విద్యుత్‌ విలుగులు అందించేందుకు నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హుస్సేన్‌ సాగర్‌ దిగువన 1920లోనే హుస్సేన్‌ సాగర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ విద్యుత్‌ కేంద్రం 1983 వరకు తన సేవలు అందించింది. సీమాంధ్ర పాలకులు ఈ విద్యుత్‌ కేంద్రాన్ని తొలగించి దానిపైనే ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌, ఎన్‌టీఆర్‌ గార్డెన్స్‌ నిర్మించారు. తద్వారా ఈ ప్రాంతానికి తొలి వెలుగులు అందించిన చారిత్రక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రమే లేకుండా చేశారు. హైదరాబాద్‌కు 1920లోనే కరెంట్‌ రాగా తర్వాత దశలవారీగా సమీప ప్రాంతాలకు విద్యుత్‌ ప్రసారం చేశారు. హైదరాబాద్‌కు కరెంట్‌ వచ్చిన 25 ఏళ్ల తర్వాతగానీ సీమాంధ్ర ప్రాంతానికి కరెంట్‌ వెలుగులు అందలేదు. అంతకాలం అంధకారంలోనే మగ్గిన సీమాంధ్రులు ఇప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
రోడ్డు రవాణా సంస్థ :
భారత దేశానికి స్వాతంత్రం రావడానికి 15 సంవత్సరాల పూర్వమే హైదరాబాద్‌ సబ్‌ అర్బన్‌ ప్రాంతాల్లో 1932 జూన్‌ 13న హైదరాబాద్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 12 బస్సులతో సిటీ, సబ్‌ అర్బన్‌ ప్రాంతాల్లో ప్రారంభమైన పౌర రవాణా సేవలు క్రమేణ విస్తరించాయి. నిర్దేశిత వేలల్లో బస్సులు నడిపేందుకు యురోపియన్‌ ట్రాఫిక్‌ సూపరింటెండెంట్‌ను కూడా నియమించారు. 27 బస్సులను స్కాట్లాండ్‌లోని అల్బిన్‌ మోటర్స్‌ నుంచి దిగుమతి చేసి పౌర రవాణాకు వినియోగించారు. ఆ రోజుల్లో 166 మంది ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేసేవారు. నిజాం స్టేట్‌ ఆర్టీసీని రూ.3.93 లక్షలతో ప్రారంభించారు. మొదటి రైల్వే లైన్‌ నిర్మాణం (బొంబాయి – రాయచూర్‌) 1866లో ప్రారంభమైంది. 1874లో నిజాం రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేశారు. 1883లో నాంపెల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
పౌర విమానయాన సేవలు :
దార్శనికుడైన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1930లోనే హైదరాబాద్‌లో పౌర విమానయాన సేవలు ప్రారంభించారు. భేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. హైదరాబాద్‌ ఎయిరో క్లబ్‌ను స్థాపించారు. నిజాం దక్కన్‌ ఎయిర్‌ వేస్‌, బ్రిటిష్‌ ఇండియా ఎయిర్‌లైన్స్‌ ద్వారా ప్రజలను తక్కువ సమయంలోనే విమానాల ద్వారా గమ్యానికి చేర్చేవారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ మనుగడలో ఉండగానే సీమాంధ్ర సర్కారు వందలాది ఎకరాల భూములు బలవంతంగా సేకరించి ంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కింద వందలాది ఎకరాల పళ్లు, కూరగాయలు, పూల తోటలు శిథిలమయ్యాయి. ఇంతచేసి దాని నిర్వహణ బాధ్యతలు జీఎంఆర్‌కే కట్టబెట్టి ఓ సీమాంధ్ర పెత్తందారును కుభేరుడిగా మార్చేసింది.
కోహినూర్‌ వజ్రం :
ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్‌ వజ్రం తెలంగాణ ప్రజల సొంతం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం (105 కారెట్లు, 21.6 గ్రాములు). 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్‌తో సంధి చేసుకొని అపార సంపదతో పాటు ఈ వజ్రాన్ని కానుకగా సమర్పించుకున్నాడు. అటు తర్వాత బాబర్‌, అల్లావుద్దీన్‌ ఖిల్జీ, నాదిర్‌ షా, రంజిత్‌సింగ్‌, దిలీప్‌సింగ్‌ చేతుల మీదుగా లార్డ్‌ డల్హౌసీ చేతికి వెళ్లింది. డల్హౌసి దానిని విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇప్పించాడు. ఆమె తన కిరీటంలో ఈ వజ్రాన్ని ధరించగా రాజవంశం సంప్రదాయక కిరీటంలో కలికితురాయిగా కొనసాగుతోంది. ఈ వజ్రాన్ని తిరిగి మన దేశానికి తెప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
వక్ఫ్‌ భూములపై ల్యాంకో హిల్స్‌ :
హైదరాబాద్‌ ముస్లింలకు నిజాం నవాబు కేటాయించిన వక్ఫ్‌ బోర్డు భూములను సీమాంధ్ర పాలకులు బలవంతంగా లాక్కొని సీమాంధ్ర పెత్తందారులకు కేటాయించారు. మణికొండ జాగీర్‌ పరిధిలోని హుస్సేన్‌ షా వలీ దర్గాకు చెందిన 14 వందల ఎకరాల భూముల్లో సమైక్యాంధ్ర కోసం గొంతు చించుకొని అరిచే లగడపాటి రాజగోపాల్‌ వంద ఎకరాలకు పైగా కబ్జా చేసి ల్యాంకో హిల్స్‌ పేరుతో అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు. హైదరాబాద్‌ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు చెందిన భూములను అప్పనంగా గోల్ఫ్‌కోర్సులు, విల్లాల పేరుతో ఎమ్మార్‌, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ సంస్థలకు కట్టబెట్టారు. ఈ క్రమంలో ఎన్నోచారిత్రక వారసత్వ కట్టడాలను నిర్మూలించారు. ఇప్పుడు మెట్రో రైలు పేరుతో హైదరాబాద్‌ చారిత్రక విధ్వంసానికి మరోసారి తెగబడుతున్నారు. స్వాతంత్రానికి పూర్వమే ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను తమ వ్యాపార సామ్రాజ్యానికి అడ్డగా మార్చుకొని సాంస్కృతిక, జీవన విధ్వంసానికి పాల్పడ్డారు సీమాంధ్రులు. హైదరాబాద్‌ను కొళ్లగొట్టి అభివృద్ధి చేశామని అబద్ధాలు వల్లిస్తున్నారు. వారి గోబెల్స్‌ ప్రచారానికి సమాధానమిచ్చే ప్రయత్నమిది. సీమాంధ్రుల దుర్నీతి, దుశ్చర్యలను పాఠకుల ముందు ఉంచుతున్నాం.