ప్రజాస్వామ్య దేశంలో ఆందోళన చేసుకోవచ్చు : డీజీపీ


మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు అణచారు
విలేకరుల ప్రశ్నకు నీళ్లు నమిలిన దినేశ్‌రెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) :
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగు తున్న ఉద్యమాలకు పోలీ సులను బాధ్యులను చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయ త్నించవద్దని డిజిపి దినేష్‌రె డ్డి పేర్కొన్నారు. డిజిపి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులకు కులం, మతం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. తాను డిజిపిగా బాధ్యతలు తీసుకుని రెండేళ్లు అయిందని, ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రబ్బర్‌ బుల్లెట్‌ కూడా ప్రయోగించలేదన్నారు. తెలంగాణాలో ఉద్యమాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించామో నేడు కూడా సీమాంధ్రలో ఉద్యమంలో అమలు చేస్తున్నామన్నారు. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవాలనుకున్నా కూడా శిక్షఒక్కటే ఉంటుందన్నారు. ఇందులో ప్రాంతాలవారిగా మారవన్నారు. ఆందోళనకారులు జాతీయస్థాయినేతల విగ్రహాలను నేడు ధ్వంసం చేస్తుంటే కేసులు నమోదు చేస్తూనే ఉన్నామన్నారు. సీమాంధ్రలో ఉద్యమాలు జరిగే అవకాశాలున్నాయనే ఉద్దేశ్యంతోనే 50 పారామిలిటరీ బలగాలను అదనంగా తెప్పించి వినియోగిస్తున్నామన్నారు. ఎక్కడా కూడా విధ్వంసం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్ర నేతలు పికెటింగ్‌లు నిర్వహించడం మానుకోవాలన్నారు.దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలున్నాయన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు సంబందించి సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు అనుమతిలేదన్నారు. సచివాలయంలో భధ్రత కావాలని దరఖాస్తు వస్తే తాము ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. ఆందోళనకారులు రైల్వే పట్టాలు ఎక్కి నిరసన తెలుపాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కనీసం బెయిల్‌ కూడా రావడం కష్టమే అవుతుందన్నారు. ఇప్పటికి తెలంగాణా వాదులు బెయిల్‌ రాక జైలులోనే ఉన్నారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ర్యాలీలు నిర్వహించుకోవడం హక్కు అని అయితే ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే పోలీసు పాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఉద్యమం విస్తరించి ఉందని, తెలంగాణ ఉద్యమం మొత్తం హైదరాబాద్‌ చుట్టూ ఉండడం వల్లే చర్యలు కఠినంగా కనిపించి ఉంటాయన్నారు. కొన్ని చానళ్లు కూడా మితివిూరి వ్యవహరిస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. గతంలో వాటిని నేటివి చూపిస్తూ పోలీసుల ఆత్మస్థైర్యంపై దెబ్బ తీస్తున్నారన్నారు. దీనివల్ల ప్రజలకే నష్టం కలుగుతుందన్నారు. ఏఆందోళన గురించి అయినా ఫిర్యాదు వస్తేనే తాము రంగంలోకి దిగుతామన్నారు. గతంలో జరిగిన చర్యలకు తనను బాద్యున్ని చేయకూడదన్నారు. తెలంగాణాలో ఇటీవలే జరిగిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి లక్షలాది మంది తరలి వస్తారని ప్రచారం చేయడంతో తాము కట్టుదిట్టమైన భద్రత చేపట్టామని, అయితే నేడు సీమాంధ్రలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఉద్యమం వివిధ ప్రదేశాల్లో విస్తరించి ఉన్నందున తమచర్యలు కనిపించడం లేదన్నారు. పోలీసులకు కావాల్సింది ఫిర్యాదుదారుడు, ముద్దాయి మాత్రమేనన్నారు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఓయూలో మాదిరిగానే ఎస్‌కేలో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉద్యోగుల కార్యాలయాల్లో ఆందోళనలు చేయరాదని సీమాంధ్ర నేతలను ఆయన హెచ్చరించారు. జాతీయనేతల విగ్రహాలను ధ్వంసం చేస్తే జాతిని అవమానపరిచిన వారే అవుతారని ఆయన పేర్కొన్నారు.