మత్తడి పోస్తున్న పాకాల చెరువు
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంమైన పాకాల చెరువు గరిష్టనీటి సామర్థ్యం 30 అడుగులకు చేరుకుని బుధవారం ఉదయం నుంచి అర ఇంచి మత్తడి పోస్తోంది. గతేడాది కూడా నెల రోజుల పాటు మత్తడి పోసి పర్యాటకులను ఆకర్షించింది. నీటి మట్టం సంపూర్ణంగా ఉండటంతో పాకాల ఆయకట్టు లోని 35 వేల ఎకరాలలో ఖరీఫ్ సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీలో కూడా పదివేల ఎకరాలకు నీరు అందించ వచ్చని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మత్తడి పోస్తుండటంతో బుధవారం నుంచి పాకాలకు పర్యాటకుల సంఖ్య పెరగనుంది.