మీ భద్రతకు పూచీ మాది


సీమాంధ్రులకు
టీ-మంత్రుల భరోసా
హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) :
హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతీయుల భద్రతకు తాము బాధ్యత తీసుకుంటామని తెలంగాణ మంత్రులు హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఔన్నత్యం కలిగి ఉన్న తెలగుజాతి గౌరవాన్ని విడిపోయి మరింత పెంచేందుకు సహకరించాలని ఏపీిఎన్జీవోలు, సీమాంధ్ర ప్రజలకు తెలంగాణకు చెందిన మంత్రివర్గ ప్రతినిధులు పిలుపు నిచ్చారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సమావేశమైన మంత్రులు సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగు మాట్లాడే వారు రెండుగా విడిపోయి కలిసి ఉందామన్నారు. సీమాంధ్రకు చెందిన ఉద్యోగులకు ఎలాంటి అభద్రతగాని, హక్కులుకాని దూరం కావన్నారు. రెండు ప్రాంతాల్లో ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు. సామరస్య పూర్వకంగా విడిపోయి కలిసి ఉండేందుకు సహకరించాలని జానారెడ్డి కోరారు. సమ్మెను విరమించి కేంద్రం నియమించిన ఆంటోనీ కమిటీ ముందు, రాష్ట్ర ప్రబుత్వం వేసిన సబ్‌కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పు కోవాలన్నరు. జీవించే విషయంలో ఏఒక్కరికి అనుమానం అక్కరలేదన్నారు. హైదరాబాద్‌ కేవలం సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులతోనే లేదని అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. వారికి లేని అభద్రతా భావం సీమాంధ్రులకు అవసరం లేదన్నారు. ప్రాంతాలుగా విడిపోయి రెండు రాష్టాల్రను అభివృద్ది చేసుకుందామన్నారు. సమ్మె నిర్ణయాన్ని పునః సవిూక్షించుకోవాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వస్తున్న అనేకానేక రాజకీయ, ఉద్యోగవర్గాల విమర్శలకుతాము సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని, తమవద్ద ధీటైన సమాధానాలు కూడా ఉన్నాయన్నారు. అయితే దీనివల్ల మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయనే భావనతోనే సంయమనం పాటిస్తున్నామన్నారు. తాము మాత్రం కేవలం సంయమనంతోనే వ్యవహరించాలని నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. తమ సమాధానంలో ఇరు ప్రాంతాల్లో ఉద్వేగాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని తద్వారా రాష్ట్రం ఏర్పాటు జఠిలం కావద్దనేదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు ధీటుగా తెలంగాణా ఉద్యోగులు సైతం సమ్మెకు దిగేందుకు ప్రయత్నించడం గాని, ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం కాని మానుకోవాలన్నారు. టీ ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని జానారెడ్డి కోరారు. అంతకు ముందు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆంటోని కమిటీ ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, చారిత్రక సంపదను వివరించాలని నిర్ణయించారు. సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్న అబ్యంతరాలను సైతం కమిటీకి సవివరంగా జవాబు చెప్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంటోని కమిటీని కలిసేందుకు ఢిల్లీ వెల్లాలని నిర్ణయించారు. తెలంగాణకు మద్దతుగా కేంద్రం అడుగులు వేస్తున్నందున తీవ్రమైన సంయమనం పాటించాలని ఏకాభిప్రా యానికివచ్చారు. ఈసమావేశంలో ఉపమఖ్యమంత్రి దామోదరరాజనర్సింహతోపాటు డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డికె అరుణ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.