ఏపీఎన్‌జీవోల సమ్మెపై హైకోర్టు గుస్సా


ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనండి
రాజకీయ నిర్ణయాలపై మీరెట్ల సమ్మె చేస్తారు?
హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని ధిక్కరించేలా వ్యవహరించడంపై మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి రాజకీయ ఉద్యమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించింది. ‘మీరు ప్రైవేట్‌ ఉద్యోగులా? ప్రభుత్వ ఉద్యోగులా? సమ్మె రాజ్యాంగ విరుద్ధం. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సమ్మెలో పాల్గొనండి’ అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడంలో తప్పు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె అనైతికమని, వెంటనే సమ్మె విరమించేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతిసేన్‌ గుప్తా, జస్టిస్‌ కేసీ భానులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ
దాఖలైన పిటిషన్‌నూ ధర్మాసనం విచారించింది. ఏపీ ఎన్జీవోల సమ్మెను తీవ్రంగా తప్పుబట్టిన న్యాయస్థానం.. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సమ్మైక్యాంధ్ర ఉద్యమం కోసం సమ్మె చేయడమేమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి రాజకీయా ఉద్యమాల్లో ఎలా పాల్గొంటారని నిలదీసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరెలా సవాల్‌ చేస్తారని హైకోర్టు ఏపీఎన్జీవోల సంఘాన్ని ప్రశ్నించింది. ‘విూరు ప్రభుత్వ ఉద్యోగులా..? ప్రైవేట్‌ ఉద్యోగులా? రాజకీయ పరమైణ నిర్ణయాన్ని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులు ఎలా ఉంటుంది?’ అని నిలదీసింది. రాజకీయాల కోసం సమ్మె చేయొద్దని సూచించింది. సమ్మె చేయాలని విూకు అంతగా ఆసక్తి ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి సమ్మెలో పాల్గొనాలని వ్యాఖ్యానించింది. సమ్మె కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర విభజన కోసం ఎలాంటి ప్రక్రియ అవలంభించారన్న అంశాలపై వివరణతో కూడిన నివేదికను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్జీవోలు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలంటూ వారు విధులకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారి సమ్మె చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె అనైతికమని, తక్షణమే వారు సమ్మెను విరమించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది రవికుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, న్యాయస్థానం తక్షణమే జోక్యం చేసుకొని సమ్మె విరమించాలని వారిని ఉద్యోగులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన ధర్మాసనం.. ప్రభుత్వంతో పాటు ఏపీ ఎన్జీవోల సంఘం, సచివాలయ  సీమాంధ్ర ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అయితే, ఏపీ ఎన్జీవోల సంఘం బుధవారం కౌంటర్‌ దాఖలు చేయలేదు. కౌంటర్‌ దాఖలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని ఏపీ ఎన్జీవోల సంఘం కోర్టును కోరింది. దీంతో కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.