ఆర్థిక రాజధానిలో దారుణం


మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం
నిందితుల ఊహా చిత్రాల విడుదల
పలువురి అరెస్టు
ముంబయి, ఆగస్టు 23 (జనంసాక్షి) :
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కామాంధులు మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం చేశారు. దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన ప్రజల మనోఫలకం పైనుంచి ఇంకా చెరిగిపోక మునుపే ఈ దారుణం చోటు చేసుకుంది. మధ్య ముంబుయిలోని పార్లె ప్రాంతంలో ఓ మహిళా ఫొటో జర్నలిస్టు (23)పై ఐదుగురు కామాంధులు గురువారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌లో ఫొటో జర్నలిస్టుగా పని చేస్తున్న యువతి.. విధి నిర్వహణలో భాగంగా గురువారం రాత్రి 8 గంటల సమయంలో పార్లె ప్రాంతంలోని శక్తిమిల్స్‌ ప్రాంగణానికి వెళ్లారు. ఆ ప్రాంతమంతా చాలవరకూ మాదక ద్రవ్యాలకు బానిసలైన వారితో కిక్కిరిసి ఉంటుంది. ఆ ప్రాంగణంలో ఆమె ఫొటోలు తీసుకొనేందుకు యత్నించింది. ఆమె ప్రయత్నాన్ని కొంత మంది యువకులు అడ్డుకుని, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. మరో ముగ్గురు యువతిని పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో ఇద్దరు యువతి, ఆమె సహాయకుడు ఆస్పత్రికి చేరుకున్నారు. జరిగిన ఘటన తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం యువతి ముంబైలోని జాన్‌ లాచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆస్పత్రి సీఈఓ తరన్‌ జ్ఞాన్‌చాందినీ తెలిపారు. ఆమె అంతర్గత అవయవాలకు గాయాలయ్యాయని, మెరుగైన వైద్యసాయం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు, బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా ఐదుగురు నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇదిలా ఉంటే, జాన్‌లాచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహారాష్ట్ర ¬ం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ పరామర్శించారు. అత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. దారుణ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలి స్నేహితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వారిని ఇవాళో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.