రియల్‌ ఎస్టేట్‌ కోసమే సమైక్యాంధ్ర


మన భాష యాసను ఎగతాళి చేసిండ్రు : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) :
సీమాంధ్ర పెట్టుబడిదారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసమే సమైక్యాంధ్ర కోరుతున్నారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం నగరంలోని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌లో నిర్వహించిన టీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాషను ముందుపెట్టి కుట్రలతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు రాజకీయాలు చేసిన సీమాంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో అన్నింటా తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలిపారు. తెలుగు జాతి, తెలుగు భాష అంటూనే మన మన భాష యాసలను ఎగతాళి చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న వేలాది ఎకరాల నిజాం సర్ఫేకాస్‌ భూములు, ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో అప్పనంగా దోచుకొని ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు చెందాల్సిన భూములు దోచుకొని కోట్లకు పడగలెత్తిన సీమాంధ్రులు ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే తమ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర పేరుతో సీమాంధ్ర పెట్టుబడిదారులు నడుపుతున్న కేవలం మీడియా ఆర్భాటం మాత్రమేనని తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో 90 శాతానికి పైగా ప్రజలు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని గుర్తు చేశారు. అక్కడి దళిత బహుజన ఉద్యోగులు సమ్మెకు సైతం దూరంగా ఉండి ప్రత్యేక ఆరధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. ప్రాతిపదిక లేని ఉద్యమాన్ని పదే పదే చూపుతూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. సీమాంధ్ర వలస పాలనలో తెలంగాణ అన్నింటా దోపిడీకి గురైందని తెలిపారు. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే సీమాంధ్రుల డిమాండ్‌పై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ ఎప్పటికీ తెలంగాణలో అంతర్భాగమని ఆయన తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల వారు ఉంటున్నట్లుగానే సీమాంధ్రులు కూడా ఉండవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ నిక్షేపంగా పనిచేసుకోవచ్చని, తెలంగాణ వనరులు కొళ్లగొట్టే వారితో తమ పోరాటం తప్ప పనిచేసుకునే వారిపై కాదని తెలిపారు. ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద మార్కెట్‌ నైజామేననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.