హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణదే


అడిగే హక్కు సీమాంధ్రులకు లేదు
ఆంధ్రాకో న్యాయం.. తెలంగాణాకో న్యాయమా?
దళిత, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం : అసద్దుద్దీన్‌ ఓవైసీ
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణదేనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై సీమాంధ్రులకు హక్కులేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాతంలో ముస్లిం, క్రిస్టియన్‌ మతం స్వీకరించిన దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్నాయం చేస్తుందని అసదుద్దీన్‌ ఓవైసీ లోక్‌సభలో తెలిపారు. ఆంధ్రా ప్రాంతంలో ఉన్న దళిత క్రిస్టియన్లకు ఇచ్చినట్లుగానే కేంద్ర ప్రభుత్వ తెలంగాణ ప్రాతంలో దళిత క్రిస్టియన్లకు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. షెడ్యూల్డ్‌ కులాల సవరణ బిల్లు 2012 పై చర్చ సందర్భంగా ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రిజర్వేషన్‌లకు సంబంధించి అన్యాయంపై కేంద్రానికి లేఖ రాసినా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి కాని, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కాని స్పందించడం లేదని విమర్శించారు. దేవుడిని పూజించడానికి మతం మారినంత మాత్రాన రిజర్వేషన్‌ను తీసేస్తారా అని ప్రశ్నించారు. ముస్లింగానో, క్రిస్టియన్‌గానో మారినంత మాత్రాన దళితులపై ఇతర ప్రజలు చూపుతున్న వివక్ష పోవడం లేదని, వారి ఆర్థిక పరిస్థితి మారడం లేదని గుర్తుచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రాంత ముస్లింలకు, క్రిస్టియన్లకు రిజర్వేషన్‌ కల్పించాలని పార్లమెంట్‌కు, ప్రధానికి అసద్‌ విజ్ఞప్తి చేశారు.