యూపీలో ఉద్రిక్తత


– ప్రవీణ్‌ తొగాడియాతో పాటు పలువురి అరెస్టు
– ఆరు జిల్లాల్లో 144 సెక్షన్‌
లక్నో, ఆగస్టు 25 (జనంసాక్షి):
యూపీలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఉదయం విహెచ్‌పి చేపట్టిన కోసి పరిక్రమ యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో విహెచ్‌పి నేతలు ప్రవీణ్‌ తొగాడియా, రామజన్మభూమి న్యాస్‌ కమిటీ చైర్మన్‌ గోపాల్‌దాస్‌, మాజీ ఎంపి వేదాంతి కూడా ఉన్నారు. లక్నో ఎయిర్‌పోర్టులో అశోక్‌సింఘాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీకి పంపించివేశారు. ఇదిలా ఉండగా అయోధ్య యాత్రను విశ్వ హిందూ పరిషత్‌ ప్రారంభించింది. రామజన్మభూమి న్యాస్‌ కమిటీ చైర్మన్‌ మహంత్‌ గోపాలదాస్‌ అయోధ్యలోని మణిరాం చవానీ నుంచి ప్రారంభించారు. కొద్ది దూరం వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు. విహెచ్‌పి జాతీయ నాయకుడు ప్రవీణ తొగాడియాతో సహా 450మంది విహెచ్‌పి కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇదిలాఉండగా యాత్ర చేసి తీరుతామని విహెచ్‌పి ప్రకటించడంతో అయోధ్యలో గట్టి బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు జిల్లాల్లో 144వ సెక్షన్‌ను విధించింది. ముఖ్యంగా ఫైజాబాద్‌, అయోధ్య జిల్లాల్లో భారీగా పోలీసులను మొహరింపజేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండుల వద్ద భారీగా పోలీసులను ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సాధువులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. దుకాణాలను మూసివేశారు. నయాఘాట్‌ మొత్తం పోలీసు వలయంగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 450మంది విహెచ్‌పి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. యాత్రను ప్రభుత్వం నిషేధించిందని, శాంతిభద్రతల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని ముందుగానే పోలీసులు హెచ్చరించారు.  ఇదిలా ఉండగా ఆదివారం ప్రారంభమైన కోసి పరాక్రమ యాత్రను సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు విహెచ్‌పి కొనసాగించనున్నది. విహెచ్‌పి తలపెట్టిన యాత్రకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ప్రకటించాయి. యూపీ ప్రభుత్వం అడ్డుకోవడంతో విహెచ్‌పి కార్యకర్తలు ఎక్కడికక్కడే నిరసనలు చేపట్టారు. సాధువుల యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యా నించారు. అడ్డుకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రలు చేపట్టడం మంచిది కాదని.. విద్వేషాలు చెలరేగి.. మత కల్లోలానికి దారితీసే అవకాశం ఉందని, తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకే యాత్రను నిషేధించామని ప్రభుత్వం చెబుతోంది.అయోధ్యలో ఎప్పుడేమి జరగనున్నదో అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు.