మా నిజాం కట్టిన జైలులో దీక్షెట్ల చేస్తవ్‌


– కడప, రాజమండ్రికో పో..
– గుత్తా సుఖేందర్‌ రెడ్డి
నల్లగొండ,ఆగస్టు 25(జనంసాక్షి):
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చంచల్‌గూడ జైలులో దీక్ష చేసే అర్హత లేదని , నిజాం కాలంనాటి  జైల్లో సీమాంధ్రకు మద్దతుగా దీక్ష చేయడాన్ని  తీవ్రంగా విమర్శించారు.  నల్లగొండలో ఆదివారం  మీడియాలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని, విభజనకు సంబంధం లేకుండా సీమాంధ్రుల ఆందోళనలపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రకటించినా సీమాంధ్ర నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఎంపీగుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడేలా జగన్‌ దీక్ష చేస్తున్నారని, ఆయన  దీక్ష చేయాలనుకుంటే  సీమాంధ్ర లోని కడప, రాజమండ్రి జైల్లో చేసుకోవచ్చన్నారు. జగన్‌ను సీమాంధ్ర జైలుకు తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. సీమాంధ్రుల ఉద్యమం శవంతో సమానమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల దీక్షలపై స్పష్టమైన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగు దేశం ఎంపీలు పవిత్రమైన పార్లమెంటులో వీధినాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ పై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ ఎంపీల సస్పెన్షన్ల విషయంలో నోరు మెదపకపోవడం తోనే ఆయన నైజం బయటపడిందని గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.