సోనియాకు అస్వస్థత


సభ నుంచి అర్ధాంతరంగా బయటకు
ఎయిమ్స్‌లో చికిత్స
నిలకడగా ఆరోగ్యం
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 8.15 గంటల సమయంలో ఆమెను చికిత్స నిమిత్తం ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించారు. సోనియా మానస పుత్రిక ఆహార భద్రత బిల్లుపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరుగుతుండగా ఆమె అస్వస్థతకు లోనయ్యారు. ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రి కుమారి షెల్జాతో కలిసి ఆమె బయటకు వెళ్లిపోయారు. స్వతహాగా నడవలేని స్థితిలోని ఉన్న సోనియాకు షెల్జా ఆసరాగా నిలిచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్న సోనియాగాంధీ ఆహార భద్రత బిల్లు కోసం పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఓటింగ్‌ పూర్తయ్యే వరకు కూర్చోవడానికి ఆమెకు ఓపిక లేకపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. 67 ఏళ్ల సోనియాగాంధీని ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగంలో చేర్చారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్‌ తాత్కాలిక డైరెక్టర్‌ ఆర్‌సీ డేకా ఆమెకు స్వయంగా వైద్యం చేస్తున్నట్లు ఎయిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.