తీవ్రస్వరం బిడ్డ! మా హక్కులను హరిస్తే తెలంగాణకు అడ్డొస్తే ఉద్యమానికే టార్గెట్ అయితరు
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, ఆగస్టు 29 (జనంసాక్షి) :
ప్రశాంత వదనంతో శాంతస్వరూపుడిగా కనిపించే టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఉగ్రరూపం దాల్చారు. బిడ్డ తెలంగాణ ప్రజలను హక్కులను హరిస్తే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డొస్తే ఉద్యమానికి టార్గెట్ అయితరు జాగ్రత్త అని సీమాంధ్ర పెట్టుబడిదారిశక్తులను హెచ్చరించారు. తమ హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించమని తెలంగాణ అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణపై దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అడ్డుపడితే ఊరుకునేది లేదని, వచ్చే నెల 7న హైదరాబాదులో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఎలా నష్టం జరుగుతుందో ఏ ఒక్క సీమాంధ్ర నాయకులు చెప్పడం లేదన్నారు. సమైక్య ఉద్యమం తెలంగాణపై దాడిగా అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కడా కలిసి ఉండాలని ఉద్యమం జరగలేదన్నారు. కలసి ఉండాలన్న ఉద్యమం అనైతికమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమైక్య ఉద్యమం తెలంగాణపై దాడి అని ఆయన ఆరోపించారు. గురువారం తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సద్భావన సదస్సులో కోదండరాం పాల్గొన్నారు. తాము తెగించి ఉన్నామని, గోచీ మాత్రమే ఉందని అన్నారు. హైదరాబాదులో తమ హక్కులకు అడ్డుపడితే ఊరుకునేది లేదన్నారు. ఏ ఒక్కరినీ తాము వదిలేది లేదని, అన్నింటికి తెగించి ఉన్నామని, గోచీ మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని కూడా హెచ్చరించారు. వచ్చే నెల 7వ తేదీన హైదరాబాదులో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు.ఈ శాంతి ర్యాలీతో హైదరాబాద్ దద్దరిల్లుతుందన్నారు. సమస్యకు పరిష్కారం చూపాల్సిన సీమాంధ్ర నేతలు లేఖలు రాయడం సరికాదని ఆయన అభిప్రాయ పడ్డారు.సీమాంధ్ర నాయకులు ఢిల్లీ పెద్దలకు లేఖలు రాయడం సరికాదని, సమస్యకు పరిష్కారం చూపించాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రధానికి లేఖ రాయడాన్ని ఉద్దేశించి చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం గత 60 సంవత్సరాలు ఎన్నో విధాల పోరాటాలు చేశామని, ఎందరో బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధీర్ఘ పోరాటాన్ని చూసి చలించిపోయిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నందున దాన్ని ఆపడం ఎవరితరం కాదన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటూ సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కృత్రిమ ఆందోళన అన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూస్తామన్నారు. కృత్రిమ ఉద్యమాల వల్ల సీమాంధ్రలోని అమాయక, సామాన్య ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలను ఆపి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో సిటీ కాలేజీ నుంచి ఇందిరాపార్క్ వరకు తెలంగాణ సాధన శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ముల్కి అమరవీరుల వారం జరుపుతామని చెప్పారు. 1న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్, 4న కరీంనగర్, 5న వరంగల్, 6న మహబూబ్‌నగర్‌లో శాంతిర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేసిన సీమాంధ్ర నేతలు విభజన ప్రకటన వచ్చిన తర్వాత సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించకుండా కేంద్రానికి లేఖ రాయడం సరికాదన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి స్నేహభావంతో కలిసి ఉందామని కోదండరామ్ సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు.