సిరియాపై కమ్ముకున్న యుద్ధమేఘాలు


దాడికి సిద్ధమవుతున్న నాటో బలగాలు
లేదు లేదంటూనే పెద్దన్న సన్నాహాలు
ప్రతిఘటిస్తామంటున్న సిరియా మిత్ర దేశాలు
డమాస్కస్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) :
ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి దాదాపు 1300 మందికిపైగా పొట్టనబెట్టుకున్న సిరియాపై యుద్ధానికి పెద్దన్న అమెరికా సన్నద్ధమవుతోంది. తన మిత్ర దేశాలు బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి సిరియాలో శాంతిస్థాపన కోసమంటూ ఏక్షణాన్నైనా బాంబులతో విరుచుకుపడేందుకు భారీ సంఖ్యలో నాటో బలగాలను మోహరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుందోనని ప్రపంచ దేశాలు టెన్షన్‌ టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. మ రోవైపు అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతున్న సిరియా తమపై దాడికి దిగే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించి కయ్యానికి కాలు దువ్వింది. యుద్ధసన్నద్ధతపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌తో ఫోన్లో చర్చించారు. సిరియాపై అమెరికా యుద్ధ సన్నా హాలను రష్యా, ఇరాన్‌, చైనా  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సిరియాలో నెలకొన్న పరిస్థితులకు దౌత్యపరమైన మా ర్గాల్లో పరిష్కారం కనుగొనాలే తప్ప యుద్ధం మంచిదికాదని ఐక్యరాజ్యసమితి భావిస్తుంది. ఏడాదికాలంగా సిరియాలో శాంతి స్థాపనకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని బ్రిటన్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి విలియం హేగ్‌ వ్యాఖ్యానించారు. తప్పనిసరి పరిస్థితు ల్లోనే సిరియా వ్యవహారంలో జోక్యం చేసుకో వాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. సిరి యాపై సైనిక చర్యకు సంబంధించిన అవ కాశాలపై అమెరికా తన మిత్రదేశాల సైనిక అధ్యక్షులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సంప్రదింపుల ప్రక్రియకు బ్రిటన్‌ రక్షణ శాఖ చీఫ్‌ నేతృత్వం వహిస్తున్నారు. సిరియాపై సైనిక చర్యకు ఐక్యరాజ్యసమితి అనుమతించకపోవచ్చు. దీనికి సంబంధించిన ఏ ప్రతిపాదననైనా రష్యా, చైనా వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకున్నా సిరియాపై అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని నాటో బలగాలు పేర్కొంటున్నాయి. సైనిక చర్య అనేది అంతర్జాతీయ చట్టాల ప్రకారం చట్టబద్ధమైనదేనని నాటో ప్రతినిధులు వాదిస్తున్నారు.