సీమాంధ్రుల కుటిల యత్నాలు తిప్పికొట్టండి


హైదరాబాద్‌లో నాటకాలపై టీ ఉద్యోగుల ఫైర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) :
వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పార్టీలు చేస్తున్న కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యోగులు పిలుపునిచ్చారు. ప్ర శాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెట్టేందుకు సీమాంధ్ర ఉద్యోగులు ఏపీఎన్జీఓలు కార్యాలయాల్లో నిరసన పేరుతో తెలంగాణ వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలను కొనసాగి స్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్‌ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగి సంతోష్‌పైనే చేయి చేసుకోవడమేకాక తమ ఉద్యోగులపై తెలంగాణవాదులు దాడులు చేస్తున్నారంటూ ఆందోళనకుదిగారు. ఈసంఘటనపై నిజనిర్దారణ కోసం విద్యుత్‌ సౌధకు వెల్లిన న్యాయవాదులను అడ్డుకోవడమే కాక అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించడం, కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం తెలంగాణ జిల్లాల్లోని చిన్నా, చితక, పెద్ద కోర్టుల్లో సైతం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్లెక్కి ర్యాలీలు నిర్వహించారు. పలు చోట్ల సీమాంధ్ర దిష్టిబొమ్మలను దగహం చేశారు. ఈసందర్భంగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రుల పరిస్థితి చూస్తే జాలేస్తుందన్నారు. ఓసారి ఏడవాలో, నవ్వాలో కూడా అర్థం కావడంలేదన్నారు. పోలీసులకు ఇక్కడున్న అధికారాల్లో కనీసం పదిశాతం కూడా సీమాంధ్రలో లేవన్నారు. ప్రత్యక్షంగా ఆస్తులు, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా కూడా ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని న్యాయవాదులు నిలదీశారు. తెలంగాణకు చెందిన అధికారులు, ఉద్యోగులను హింసిస్తున్న వారి సంఘటనలను బహిర్గతం చేసినా కూడా ఎందుకు కేసులు నమోదు చేయడం లేదన్నారు.  రాష్ట్రంలో రావణకాష్టం సృష్టించి వచ్చిన తెలంగాణాను అడ్డుకోవాలని చూస్తే తాము సహించపోమన్నారు. జగన్‌ను తక్షణమే సీమాంధ్రలోని ఆసుపత్రికి తరలించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణా అడ్డుకుంటున్న ప్రతి ఒక్కరికి సీమాంధ్ర ప్రజలే రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెపుతారని న్యాయవాదులు హెచ్చరించారు. తమకు మరోసారి పోరాటాలు చేయడం చేతకాక కాదని, కాంగ్రెస్‌ అధిష్టానంపై నమ్మకం ఉంది కాబట్టే ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యోగి సంతోష్‌పై దాడికి పాల్పడిన సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.