ఢిల్లీలో ఘోరం యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం


నొయిడా, ఆగస్టు 31 (జనంసాక్షి)
దేశ రాజధాని ఢిల్లీలో రక్షక భటులు రెచ్చిపోయారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఓ యువతి పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సభ్య సమాజానికే తలవంపులు తెచ్చారు. ముంబయి అత్యాచార ఘటనలను మరువక ముందే దేశ రాజధాని శివారులో మరో ఘోరం వెలుగు చూసింది. కంచే చేను మేసిన చందంగా మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే స్నేహితులతో కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను స్థానిక ఎస్పీ యోగీశ్‌ సింగ్‌ శనివారం విలేకరులకు వెల్లడించారు. రాజధాని శివారు షహదరా ప్రాంతానికి చెందిన ఓ యువతి (25) తన ఆస్తి వ్యవహారాలను చూసే స్నేహితుడిని కలిసేందుకని, శుక్రవారం సెక్టార్‌-105, బీ-బ్లాకులోని ఆయన కార్యాలయానికి వచ్చింది. రాత్రి 7-8 గంటల సమయంలో వారిద్దరూ మాట్లాడుకుంటుండగా పీఏసీ హెడ్‌కానిస్టేబుల్‌ బన్షీరాం శర్మ, కానిస్టేబుల్‌ సుభాష్‌లు తమ స్నేహితులు అరుణ్‌, బంటీ, జీతూతో కలిసి అక్కడికి వచ్చారు. సదరు వ్యక్తి చితకబాది, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వెళ్తూ వెళ్తూ ఆమె సెల్‌ఫోన్‌, ఏటీఏం కార్డులనూ దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆ కార్డుతోనే తాము వచ్చిన పోలీసు జీపులో పెట్రోలు పోయించుకున్నారు. విషయం తెలిసిన నొయిడా పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి నలుగురు నిందితులను పట్టుకున్నారు. మరో నిందితుడు జీతూ కోసం గాలిస్తున్నారు. వారు వాడిన జీపును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నొయిడా (సెక్టార్‌-39) పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.