వైకాపా యూటర్న్‌ ముసుగు తొలగించుకొని సమైక్యం వైపు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) :
తెలంగాణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యూటర్న్‌ తీసుకుంది. పూర్తిగా సీమాంధ్ర పార్టీగా మారిపోయింది. సమైక్య శంఖారావం పేరిట రేపటి నుంచి షర్మిల బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి ప్రకటించారు. నిన్నటి దాకా సమన్యాయం అన్న విజయలక్ష్మి ఈ రోజు ప్రజలకు లేఖ పేరుతో సమైక్యరాగం అందుకోవడంతో తెలంగాణ ప్రాంతంలో మిగిలిన వైకాపా నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడంలో కేంద్రం విఫలమైన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా వైకాపా అంతకు మునుపు పేర్కొంది. సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల సోమవారం యాత్ర చేపట్టనున్న తరుణంలో విజయమ్మ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్లుపై కన్నేసి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిందని ఆమె ఆరోపించారు. ఇందుకు లేఖ ఇచ్చి ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని ఆమె లేఖలో పేర్కొన్నారు. బాబు సీమాంధ్ర ప్రాంతంలో యాత్ర చేపట్టేముందు తెలంగాణపై ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ‘మా పార్టీ ప్రధానమంత్రికి రాసిన లేఖ ప్రకారం మూడు పార్టీలు (వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎం, ఎంఐఎం) సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నాయి. అలాగే ఐదు పార్టీలు (కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌, సీపీఐ) రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చాయి’ అని అమె తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడంలో కేంద్రం విఫలమైన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంతకు మునుపు పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ ”ఓట్లు, సీట్లు” పై కన్నేసి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిందని ఆమె ఆరోపించారు.