సిరియాపై సైనిక చర్య వాయిదా
మళ్లగుల్లాలు పడుతున్న పెద్దన్న
వాషింగ్టన్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) :
సిరియాపై సైనిక చర్యకు అమెరికా వెనుకంజ వేసింది. రసాయన దాడి జరపి 1,300మంది పౌరులను బలిగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న సిరియాపై సైనిక చర్యను ప్రస్తుతానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ సభ్యుల ఆమోదం లభించిన తరువాత దాడి చర్యపై ఆలోచిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా స్పష్టం చేశారు. అంతకుముందు సిరియా పౌరులపై దాడిని ఖండించిన అమెరికా దాని మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సిరియా ప్రభుత్వంపై తొలుత దాడి చేయాలని భావించినా వెనక్కు తగ్గాయి. గతవారం బ్రిటన్ పార్లమెంట్‌లో సిరియాపై దాడి తీర్మానం ప్రవేశపెట్టగా అది వీగిపోయింది. ప్రధాని కామెరాన్ యుద్ధ ప్రయత్నాలను పార్లమెంట్ 285-272 ఓట్లతో తిరస్కరించింది. లక కన్సర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు కూడా కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. సరైన ఆధారాలు లేకుండా సిరియా ప్రభుత్వంపై దాడి చేయడం సబబు కాదని అత్యధిక మంది సభ్యులు తెలిపారు. ప్రజలు పార్లమెంట్ వ్యతిరేకిస్తున్నందున సిరియాలో జోక్యం చేసుకోబోమని ప్రధాని కామెరాన్ ప్రకటించారు. ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటామని కామెరాన్ తెలపడంతో అమెరికా కూడా వెనకడుగు వేయక తప్పలేదు.