ముల్కీ శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) :
ముల్కీ వారోత్సవాల విజయంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్న శాంతిర్యాలీని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడమేకాక ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించేందుకు జేఏసీ నేతలు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా బెటాలియన్లకు బెటాలియన్ల పోలీసులను రంగంలోకి దింపి ఎక్కడికక్కడే అరెస్ట్‌ల కార్యక్రమాన్ని చేపట్టాడు సీమాంధ్ర దురహంకారి అయిన డిజిపి దినేష్‌రెడ్డి, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలు. ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు ఖంగుతినాల్సిన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆందోళనకారులను పోలీసు వ్యాన్లలో ఎక్కించారు. ఈసందర్బంగా తెలంగాణాగెజిటెడ్‌ అధికారుల సంఘం అద్యక్షుడు శ్రీనివాసగౌడ్‌ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణా ఉద్యమం అనగానే పోలీసులకు ఎక్కడలేని కోరలు పుట్టుకువస్తాయని, తెలంగాణా వాదులు నక్సలైట్లుగానో, జాతిద్రోహులుగానో కనిపిస్తారని ఆరోపించారు. సీమాంద్రలో ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేస్తున్నా తెలంగాణా ఉద్యోగులపై బౌతికంగా దాడులు చేస్తున్నా కూడా కనీసం ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకున్న సంఘటనలు లేవన్నారు. హైదరాబాద్‌లో మాత్రమే పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని, మానవహక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాంతంలో తాము శాంతియుతంగార్యాలీలు చేసుకునే హక్కు కూడా లేదా అని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆక్షేపించారు. సిఎం డైరెక్షన్‌ ప్రకారమే పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణా రాష్ట్రం వచ్చిన తర్వాత చిట్టచివరిగా తమ పై ప్రతాపం చూపిద్దామనే కుట్రతోనే కిరణ్‌ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఈనెల 7వతేదీన హైదరాబాద్‌లో నిర్వహించే శాంతి సద్బావన ర్యాలీకి అనుమతిచ్చినా ఇవ్వకపోయినా లక్షలాది మంది తెలంగాణా వాదులు తరలి వచ్చి విజయవంతం చేస్తారన్నారు. ప్రభుత్వం ఇప్పటికి కూడా వివక్షనే చూపిస్తుందని ఆరోపించారు. సీమాంధ్ర నేతలను, పాలకుల మెడలు వంచి తెలంగాణాను తెచ్చుకుని తీరుతామన్నారు.