సీమాంధ్రులు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు


తెలంగాణ వచ్చి తీరుతుంది : జానారెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) :
సీమాంధ్ర నేతలు, ప్రజలు రెచ్చగొట్టే విధానాలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు రెచ్చిపోవద్దని, సంయమనం పాటించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ సారధ్య బృందం ఆదివారం లకిడికాపూల్‌లో సద్భావనాగోష్టిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి జానారెడ్డితో పాటు ఎంపీలు వి.హన్మంతరావు, రాపోలు ఆనందభాస్కర్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. సీమాంధ్రులు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటుపై జాప్యం జరుగుతున్నందు వల్లనే సీమాంధ్రులో ఆందోళనలు చెలరేగుతున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదం తెలపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవలంబిస్తున్న వైఖరి పట్ల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని దీన్ని ఎవరూ మార్చలేదని, ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజలు వాస్తవాలను గ్రహించి ఉద్యమాలు ఆపి రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు. విభజన వల్ల సీమాంధ్రులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చోని చర్చించి పరిష్కరించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాలవాంచ కోరిక అని, గత 60 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఉద్యోగులకు ఏవైనా ఇబ్బంది అపోహాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. తెలంగాణ రాష్ట్రం అనివార్యమనే ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇష్టానుసార జివోలు ఇస్తున్నారని ఆయన వ్యవహారాలపై తెలంగాణ మంత్రులు కన్నేసి కనిపెట్టాలని ఎంపిలు కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయాలన్నీంటిని సమీక్షిస్తామన్నారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ ఆత్మగౌరవ దినంగా పాటించాలని నేతలు పిలుపునిచ్చారు.