ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ నేనే అడ్డుకున్న


నిర్లజ్జగా ప్రకటించుకున్న బాబు
గుంటూరు, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) :
ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటును తానే అడ్డుకున్నానని టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్లజ్జగా ప్రకటించాడు. రాష్ట్రంలో అ న్యాయానికి గురవుతున్న సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు తన చిట్టచివరి రక్తపు బొట్టుతో సైతం పోరాడుతానని టిడిపి అది óనేత నారా చంద్రబాబునాయుడు ప్రకటిం చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాం ధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనలు న్యాయమైనవని గుర్తించిన బాబు గుంటూరు జిల్లాలో ఆదివారం ప్రారంభించిన బస్‌ యాత్రను రెండోరోజు పిడుగురాళ్లలో ప్రారంభించారు. ఈసందర్భంగా గుమికూడిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ముద్దపప్పులాంటి రాహుల్‌ను ప్రధానిగా చేసేందుకు తల్లి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు.  పార్లమెంట్‌ సభ్యుడిగా అయిదేళ్లు పూర్తిచేసుకుంటున్న ఆయన ఒక్కసారంటే ఒక్కసారైనా నోరు విప్పి ప్రజా సమస్యలపై గళం వినిపించారా అని బాబు ప్రశ్నించారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ను, సీమాంధ్రలో వైఎస్సార్‌సిపిని సోనియాగాంధీ తన కాళ్లక్రింద చెప్పుల్లా వినియోగిస్తోందని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ఇటలీకి చెందిన సోనియా కుయుక్తులు పన్నుతుందని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ తన అధికారాన్ని ఉయోగించి గద్దెదించితే తగిన గుణపాఠం ఏవిధంగా చెప్పారో ఓసారి సోనియాగాంధీ గుర్తు చేసుకోవాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం కృషిచేస్తున్న పార్టీ ఒక్కతెలుగుదేశం పార్టీయేనన్నారు. ఆనాడు కూడా ఆత్మగౌరవం పేరుతో ఎన్నికలకు వెల్లి తిరిగి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకోగలిగామన్నారు. కేవలం స్వార్థం కోసమే రాష్టాన్న్రి విభజించాలని నిర్ణయించారని ఆరోపించారు. 33రోజులుగా సీమాంధ్ర ప్రజలు విద్యార్థులు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. తెలుగువారిని అనాథలుగా, బిచ్చగాళ్లుగా కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. తెలుగు వారికి అండగా ఉండేందుకు టిడిపి ఎప్పుడూ కూడా సిద్దంగానే ఉంటుందన్నారు. తెలుగువారితో పెట్టుకున్న వారెవ్వరు కూడా చరిత్రలో బాగుపడలేదన్నారు. హైదరాబాద్‌ తమదనే ఉద్దేశ్యంతోనే కాళ్లకు చెప్పులు అరిగేలా కంపెనీల చుట్టూ తిరిగి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తీసుకువచ్చానన్నారు. హైటెక్‌ సిటీ, ట్రిపుల్‌ ఐటి, నల్సార్‌ యూనివర్శిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంస్థ ను తెచ్చింది తానేనన్నారు. ఇప్పుడు అక్కడ తమ పిల్లలకు అధికారం లేదంటే ఎలా జీర్ణించుకుంటా మన్నారు. ఆనాడు వ్యక్తిగత ప్రయోజనాలు, కుటుంబ అవసరాలను కూడా ఫణంగా పెట్టి తాను తెలుగు వారి అభివృద్ది కోసం ప్రయత్నించానన్నారు. మాయమాటలు చెప్పి 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ ఆయన కుటుంబానికి ఎంత దోచిపెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న మంత్రులు, ఐఎఎస్‌లు, వ్యాపారులు కూడా చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. తనకు బెయిలు అవసరం లేదన్నారు. జగన్‌ బెయిల్‌కోసం సోనియా గాందీ వాకిట్లో కాపలా కుక్కలా వైసిపి నేతలు గింగిర్లు కొడుతున్నారని ఆరోపించారు. విజయమ్మకు మాత్రం సీఎం కావాలి కాని సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం అక్కరలేదా అన్నారు. దేశంలో అవినీతి పెట్రేగి పోయిందన్నారు. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే అవినీతి కూరుకుపోయిందన్నారు. అన్యాయాలు ఎక్కడ బట్టబయలవుతాయోననే భయంతోనే అవినీతి ఫైళ్లను మాయం చేస్తున్నారని ఆరోపించారు. దొంగ దొంగా అంటు దొంగగానే మారిపోతున్నారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. మాటతప్పం మడమతిప్పం అంటూ ప్రగల్బాలు పలికిన వైసిపి నేతలు విజయమ్మ నేడు కొడుకు బెయిలు కోసం వెంపర్లాడుతోందని ఆరోపించారు. తన 9 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ధరలు పెరగలేదన్నారు. నేడు చూస్తే నెలలో రెండు మూడు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేస్తూ ప్రజలనడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ఇంతకాలం ఏవేవో సినిమా డైలాగ్‌లు కొట్టిన చిరంజీవి ఏమయ్యాడు, సీమాంధ్ర ప్రజలు కష్టాలుపడుతుంటే ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. బాబు వెంట కోడెల శివప్రసాద్‌తోపాటు పలువురు నేతలు ఉన్నారు.