సీమాంధ్ర మంత్రుల ఉత్తుత్తి హడావిడి


నలుగురిలో ఇద్దరు ఔట్‌
వచ్చిన ఇద్దరికి చుక్కెదురు
ముఖ్యమంత్రి ద్వారానే రావలన్న గవర్నర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) :
సమైక్య రాష్ట్రాన్ని కొనసా గించాలంటూ రాజీనామా చేయాలని నిర్ణయించు కు న్న సీమాంధ్ర మంత్రుల్లో విభేదాలు బయట పడ్డాయి. నలుగురు మంత్రులు రాజీనామాలు చేస్తారని తొలుత చెప్పినప్పటికీ, ఇద్దరు మాత్రమే పదవుల నుంచి తప్పుకోవడం సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల్లోనే భేదాభిప్రాయాలను నిదర్శనం. మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా పత్రాలను నేరుగా గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించారు. సోమవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి, తమ నిర్ణయానికి గల కారణాలను ఆయనకు వివరించారు. తమ రాజీనామాలను ఆమోదించాలని విన్నవించారు. మరో ఇద్దరు మంత్రులు పినిపె విశ్వరూప్‌, కాసు కృష్ణారెడ్డి కూడా రాజీనామా చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని గంటా శ్రీనివాసరావే స్వయంగా విూడియాకు కూడా తెలిపారు. కానీ వారిద్దరు మాత్రం చివర్లో మొహం చాటేశారు. దీంతో చేసేదేవిూ లేక గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామాలు సమర్పించారు. అంతకు ముందు వారిద్దరు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. తమ రాజీనామాల నిర్ణయంపై వారు సీఎంకు తెలిపారు. అయితే, తొందరపడొద్దని, కొంతకాలం వేచి చూడాలని కిరణ్‌ సూచించారు. కానీ, వారు ఆయన మాటను వినలేదు. ఇప్పటికే రాజీనామాలు సమర్పించినా మీరు ఆమోదించలేదని, అందుకే గవర్నర్‌ను కలువనున్నట్లు చెప్పి, బయటకు వచ్చేశారు.సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలన్న ఏకైక డిమాండ్‌తోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం ఆయన ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్రలోనే తనకు మంత్రి పదవి వచ్చిందని, రాష్ట్ర విభజన సమయంలో మంత్రిగా కొనసాగడం నైతికత కాదని రాజీనామా చేస్తున్నానని గంటా చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ ఇచ్చి చాలా రోజులైందని, రాజీనామా ఆమోదించక పోవడంతో గవర్నర్‌ను కలిసి రాజీనామా ఆమోదించాలని కోరామన్నారు. కాంగ్రెస్‌ను వీడనని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం వస్తే వ్యతిరేకంగా ఓటేస్తానని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన రోజునే తాము రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి ఇచ్చామని అది నెల దాటిపోయినా ఇంతవరకూ ఆమోదించ లేదని, అందువల్ల గవర్నర్‌ను కలిసి మరోమారు లేఖలు సమర్పించామని విలేకరులు అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ రోజు కూడా సీఎంను కలిసి.. రాజీనామాలు ఆమోదించాలని కోరామని చెప్పారు. కానీ ఆయన తొందరపడొద్దని, రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్లి వస్తానని, ఆ తర్వాత అంతా కలిసే నిర్ణయం తీసుకుందామని చెప్పారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఏ స్థాయికైనా వెళదామని అన్నారని చెప్పారు. కానీ మరికొంత కాలం ఆగేందుకు తాము నిరాకరించామని వివరించారు. రాష్ట్రం అంతటికి మంత్రులుగా ఉన్న తాము ఒక ప్రాంతానికి మంత్రులుగా ఉండడం నైతికంగా కరెక్టు కాదని భావించామన్నారు. తమ రాజీనామాలను ఆమోదించాలని గవర్నర్‌ కోరామని చెప్పారు. అయితే, రాజీనామా లేఖలను తాను సీఎంకు పంపి, ఆయన సిఫార్సు మేరకే వ్యవహరించాల్సి ఉంటుందని గవర్నర్‌ తమతో చెప్పారని తెలిపారు. రెండ్రోజులు ఆగడానికి ఇబ్బంది లేదని, అప్పటికీ నిర్ణయం మారకపోతే మళ్లీ గవర్నర్‌ను కలుస్తామన్నారు. తాము సీమాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.