ఊహాజనిత విషయాలపై సమ్మె ఎలా చేస్తారు?


ఏపీఎన్‌జీవోలపై హైకోర్టు ఫైర్‌
శాంతిభద్రతలపై జోక్యం చేసుకుంటాం
రాష్ట్రపతి పాలనకు సిద్ధం : కేంద్రం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) :
ఏపీ ఎన్జీవోల సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊహాజనిత అంశాలపై సమ్మె ఎలా చేస్తారని సీమాంధ్రు ఉద్యోగులను సూటిగా ప్రశ్నించింది. రాష్ట్ర విభజన జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు అధికార నోట్‌ ఏవిూ రాలేదని.. అలాంటప్పుడు ఏదో జరగబోతోందన్నట్లు ఆందోళన ఎందుకని నిలదీసింది. ఒకవేళ విభజన జరిగినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. గతంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది రాలేదని గుర్తు చేసిన ధర్మాసనం ఉద్యోగుల ప్రాథమిక హక్కులను ఎవరూ హరించజాలరని, ఊహాజనితమైన అంశాలపై సమ్మె చేయడం తగదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రభుత్వం నియంత్రించ లేని పక్షంలో తామే చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా నియంత్రణ చర్యలు చేపడతామని కూడా తెలిపింది. ఏపీ ఎన్జీవోల సమ్మె చట్టబద్దం కాదని, సమ్మె విరమించాలని ఆదేశాలు జారీ చేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. సమ్మెపై ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందని, ఎలాంటి ఫలితం వచ్చిందని చీఫ్‌ జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతిసింగ్‌ సేన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.సమ్మెపై గవర్నర్‌ నుంచి నివేదిక తెప్పించుకుంటామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. గవర్నర్‌ నివేదిక ఆధారంగా సమ్మెపై చర్యలు ఉంటాయని పేర్కొంది. కోర్టు సూచించినా కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ ఈ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైతే కేంద్రం రంగంలోకి దిగుతుందని వెల్లడించారు. గవర్నర్‌ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.మరోవైపు, సమ్మె నివారణకు తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్మాసనానికి తెలిపింది. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించామని, మంత్రుల బృందం ఏపీ ఎన్జీవోలతో చర్చలు జరుపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. ప్రస్తుతం ఏపీ ఎన్జీవోలపై నో వర్క్‌ – నో పే జీవో నెం.177 అమలులో ఉందని పేర్కొంది. పరిస్థితిపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారని, సమ్మెపై గవర్నర్‌ నుంచి నివేదిక తెప్పించుకుంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్‌ నివేదిక ఆధారంగా సమ్మె విషయంలో చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా, టీఎన్జీవోల సమ్మె సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీఎన్జీవోల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పుడు మాత్రం తమపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతిసేన్‌ గుప్తా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు అధికార నోట్‌ ఏవిూ లేదని చెప్పారు. ఒకవేళ విభజన జరిగినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వ్యాఖ్యానించారు. గతంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఉద్యోగుల ప్రాథమిక హక్కులను ఎవరూ హరించజాలరని, ఊహాజనితమైన అంశాలపై సమ్మె చేయడం తగదని స్పష్టం చేశారు. విభజన చేస్తున్నట్లు విూ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అని ధర్మాసనం ఏపీఎన్జీవోలను ప్రశ్నించింది. అయితే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగానకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఇక ప్రభుత్వం నుంచి కూడా నిర్ణయం వచ్చేస్తే తాము చేయగలిగింది ఏవిూ ఉండదు కాబట్టి ఇప్పుడే నిరసన తెలియజేస్తున్నామని ఏపీఎన్జీవోల తరఫు న్యాయవాది తెలిపారు. గవర్నర్‌ నివేదికకు సమయం పడుతుందని తేలడంతో హైకోర్టు విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.