సిరియాపై యుద్ధ సన్నాహాలు


మధ్యదరా సముద్రంలో అమెరికా, ఇజ్రాయెల్‌ క్షిపణి ప్రయోగం
జెరూసలేం, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) :
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాపై యుద్ధానికి పెద్దన్న సన్నాహాలు ముమ్మరం చేసింది. మధ్యదరా సము ద్రంలో ఇజ్రాయెల్‌తో కలిసి క్షిపణి పరీక్ష చేసింది. తద్వారా సిరియా మిత్ర దేశాలతో కయ్యానికి కాలు దువ్వింది. సిరియా సముద్ర తీర ప్రాంతంలో అమెరికా రెండు క్షిపణులు ప్రయోగించినట్లు రష్యా రాడార్‌ గుర్తించింది. ఈమేరకు రష్యా రాడార్‌ సంస్థ మీడియాకు అమెరికా దాడులపై సమాచారం ఇచ్చింది. సిరియాపై దాడికి తనను తాను సన్నద్ధం చేసుకోవడంలో బాగంగానే అమెరికా ఈ చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. కాగా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా తోసిపుచ్చింది. తామెలాంటి ప్రయోగాలు చేపట్టలేదని చెప్పింది. సిరియా ప్రభుత్వానికి, వ్యతిరేకులకు మధ్య కొన్ని రోజులుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో ఇటీవల సిరియాలో రసాయన ఆయుధాలు ప్రయోగించగా 1300 మందికిపైగా మృత్యువాతపడ్డారు. దీనినే సాకుగా చూపి అమెరికా సిరియాపై సైనిక చర్యకు నాటో బలగాలను సన్నద్ధం చేస్తోంది. అయితే అమెరికా యుద్ధోన్మాదానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ నో చెప్పింది. ఫ్రాన్స్‌ ఏటూ తేల్చకుండా డోలాయమానంలో ఉంది. ఈ నేపథ్యంలో క్షిపణి ప్రయోగాల ద్వారా మిత్ర దేశాలను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది.