మోడీ నిన్ను నమ్మి నట్టేట మునిగాం


నిప్పులు చెరిగిన ఐపీఎస్‌ అధికారి వంజెర
ఉద్యోగానికి రాజీనామా
అహ్మదాబాద్‌, సెప్టెంబర్‌ 3(జనంసాక్షి) :
గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని నమ్మి నట్టేట మునిగామని సస్పెండైన ఐపీఎస్‌ అధికారి డీజీ వంజెర  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. సోహ్రాబుద్దీన్‌ షేక్‌, తులసీరామ్‌ ప్రజాపతి, ఇష్రత్‌ జహాన్‌ నకిలీ ఎన్‌కౌంటర్ల కేసులో నిందితుడైన ఈ అధికారి ముఖ్యమంత్రిపై నిందవేస్తూ ఈరోజు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007లో అరెస్టు కావడంతో సస్పెండైన వంజర తనను, తనతోటి పోలీసు అధికారులను మోడీ కాపాలేదని ఆరోపించారు. ఈ విషయమై ఆయన పది పేజీల ఉత్తరం రాశారు. మోడీని దైవంలా చూశానని, అందుకే తాను ఇంతకాల మౌనంగా వున్నానని, కానీ తన దేవుడు అమిత్‌షా ప్రభావానికి లోనై తనని అవసరమైన సమయంలో ఆదుకోలేకపోయాడని వంజర ఆరోపించారు. వాస్తవాలు తెలియజేయడం తన నైతిక కర్తవ్యం అని పేర్కొన్న ఈ ఐపీఎస్‌ అధికారి ఎన్‌కౌంటర్‌ కేసుల్లో నిందితులైన పోలీసు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అధికారులు అందరూ కూడా ప్రభుత్వ విధానాన్ని కేవలం ఆచరించి చూపారని పేర్కొన్నారు. తాను, తన అధికారులు అన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ఎంతో అండగా నిలిచామని, అదే మర్యాద అటునుంచి కూడా ఆశించామని వంజర తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి అధికారులను జైలులోనే వుంచుతోందని ఆరోపించారు.