సీమాంధ్రుల వాదనలు ఆంటోనీ కమిటీ సవ్యంగా వింది


ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌
రాజీనామా చేయం : జేడీ శీలం
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన విషయంపై ముందుకే వెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. విభజనపై వ్యతిరేకత లేదని పేర్కొంది. రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలూ దాదాపు అంగీకరించాయని, అలాంటప్పుడు వ్యతిరేకత ఎక్కడ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం, అన్ని రాజకీయ పార్టీలు కోరిన మేరకే జరిగిందని, ఇందులో వివాదం ఏముందన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. ‘రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ఆ తర్వాతే మేం నిర్ణయం తీసుకున్నాం. ఇంకా వ్యతిరేకత ఎక్కడిది?’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలూ సరేనన్న తర్వాత మాత్రమే తాము ముందుకు వెళ్లామని, ఇప్పుడు తమను నిందించడమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌, కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. విభజన గురించి అన్ని అంశాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తున్నదన్నారు. వివిధ సంఘాల వారు ఆంటోనీ కమిటీని కలిసి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుపుతున్నారని చెప్పారు. కమిటీతో ఎవరైనా వచ్చి అన్ని అంశాలను చర్చించవచ్చని తెలిపారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందంటూ వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా.. ఆయన సమాధానం దాటవేశారు. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా అన్ని అంశాలను కమిటీ పరిశీలిస్తోందని, దాని గురించి తానేవిూ మాట్లాడనని చెప్పారు. కమిటీ అన్ని వర్గాల వారి వాదనలు విని సిఫార్సులు చేస్తుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను టార్గెట్‌గా చేసుకొని విమర్శలు చేయడంపై దిగ్విజయ్‌ స్పందిస్తూ ‘సంతోషం’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. బాబు తనకు మంచి స్నేహితుడని తెలిపారు. ఆయన కూడా తనను టార్గెట్‌ చేయడం సంతోషకరమేనని వ్యాఖ్యానించారు. అంతకు ముందు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, ఉద్యోగుల సమ్మె, పార్టీ పరిస్థితి తదితర అంశాలపై బొత్స ఆయనకు వివరించినట్లు సమాచారం.