హైదరాబాద్‌పై దాడే ఏపీఎన్‌జీవోల సభ


దాడిని తిప్పికొడుతాం
నలువైపులా పోరు బిడ్డలు అడ్డుకోండి : మంద కృష్ణమాదిగ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) :
తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోల సభకు అనుమతి ఇవ్వడమంటే మహానగరంపై దాడేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌పై దాడి చేసేందుకే ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో ఏపీ ఎన్జీవోలు సభ నిర్వహిస్తున్నారని,  అది సమైక్య సభ కాదని, హైదరాబాద్‌పై శాశ్వతంగా పెత్తనం కోసం సీఎం పెట్టిన సభ అని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 7న ఏపీఎన్జీవోలకు సభ నిర్వహించుకోవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వం 6న ఎమ్మార్పీఎస్‌ యుద్ధభేరికి, 7న తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి అనుమతివ్వలేదని, ఈ నేపథ్యంలో 7న తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ పాటించాలని ఆయన తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. అలాగే శుక్రవారం తెలంగాణ జిల్లాల్లో, మండల కేంద్రాలు, గ్రామాల్లో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. తనను తెలంగాణ ఉద్యమకారునిగా చూసి పిలుపును అమలు చేయాలని కోరారు. ఏపీఎన్జీవోల సభను హైదరాబాద్‌పై దాడికి కుట్రగా ఆయన అభివర్ణించారు.