మోడీ అంటేనే కాంగ్రెస్‌కు వణుకు బీజేపీ సీనియర్‌నేత వెంకయ్యనాయుడు
సమర్ధపాలన మోడీతోనే సాధ్యం
హైదరాబాద్, సెప్టెంబరు 16 : దేశ ప్రధానిగా నరేంద్రమోడీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సామర్ధ్యం, ఐకమత్యంగా ఉంచే సమర్ధత నరేంద్రమోడీకే ఉందన్నారు. పదేళ్ల నుంచి దేశం ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట సమస్యలతో ప్రజలు విసిగివేసారి పోయారని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై దేశమంతా విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ మోడీ అభ్యర్థిత్వంపై విషప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సానుభూతితో ఓట్లు సంపాదించాలన్న దురుద్దేశంతో ఇలాంటి విషప్రచారానికి పూనుకుంటుందని విమర్శించారు. మోడీ అత్యంత సమర్ధమైన వ్యక్తి అని పేర్కొన్నారు. మాజీ సైనికుల సభలో లక్షలాది మంది పాల్గొని మోడీకి మద్దతు తెలిపారని చెప్పారు. అన్నివర్గాల ప్రజలు దేశభవిష్యత్‌పై ఆందోళనలో ఉన్నారని చెప్పారు. గతేడాది మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై తాను వ్యాఖ్యలు చేశానని, 16జిల్లాల్లో నిర్వహించిన ప్రజాచైతన్యయాత్రలో కూడా మోడీ ప్రధాని కావాలని ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని ఆయన వివరించారు. దేశ ప్రజల రాజకీయ అభివృద్ధిని తెలిసినవారు ఏడాది క్రితమే దీన్ని పసిగట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాచరిక వ్యవస్థను తేవాలని చూస్తుందని, తండ్రి తప్పితే, తల్లి తప్పితే కొడుకు అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గుజరాత్‌లో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ విధించలేదని, దేశ ప్రజల సమైక్య, సమగ్రత ఇందుకు నిదర్శమని చెప్పారు. దాదాపు పదిశాతం అభివృద్ధిని గత పదేళ్లలో మోడీ కొనసాగిస్తున్నారని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో చూస్తే గుజరాత్‌లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువని అయినా వ్యవసాయరంగంలో ఆ రాష్ట్ర ఎంతో అభివృద్ధి సాధించిందని ఆయన వివరించారు. మోడీతోనే దేశానికి మేలు జరుగుతోందని, ప్రజల్లో విశ్వాసం కలిగిందన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వామపక్షాలు, మోడీ రాకను చూసి భయపడుతున్నాయని, అందుకే ఆయనపై ఆ పార్టీలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. దేశప్రజలు చాలా విజ్ఞత కలిగి ఉన్నారని, మోడీ లాంటి వ్యక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 300 సీట్లకు పైబడి బీజేపీకి భారీ మెజార్టీ కలిపించి స్థిరమైన పాలనను ప్రభుత్వాన్ని అందించేందుకు ప్రజలు సహకరించాలని వెంకయ్య కోరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా అద్భుత పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని, దీన్ని చూసి కాంగ్రెస్, దాన్ని మిత్రపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. నిరాశ, నిస్పఋతృహాలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా బీజేపీ ముందుకు వెళుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ ,లక్ష్మణ్ పాల్గొన్నారు.



